స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కళ్యాణం కమనీయం...!
తెలుగు సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడేటట్లుగా.. వివాహ వ్యవస్థ ఆచారాలు నేటి ఆధునిక యువతకు కళ్ళకు కట్టినట్లుగా 'వరుడు" చిత్రంలో కథానాయకుడు అల్లు అర్జున్ జరుపుకున్న ఐదు రోజుల పెళ్ళి అందరికీ గుర్తుండే వుంటుంది.'రీల్‌లైఫ్"లో ఐదు రోజుల పెళ్ళిని ఘనంగా చేసుకొన్న అల్లు అర్జున్ 'రియల్‌లైఫ్"లో తన వివాహాన్ని ఆదివారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఓపక్క తళతళ మెరిసే సినీతారలు... మరోపక్క నమస్కారాలు చేసుకుంటూ సాగిపోతున్న రాజకీయనాయకులు... ఇంకోపక్క డిగ్నిఫైడ్ గా విష్ చేసుకుంటూ వస్తున్న ఇండస్ట్రియలిస్టులు... వెరసి హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణం 'సెలెబ్రిటీ' మయం అయిపోయింది! ఇదంతా హీరో అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల వివాహ వేడుక వేదిక వద్ద కనిపించిన ఆహ్లాదకర వాతావరణం. సంప్రదాయబద్ధంగా... వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ వరుడు బన్నీ ప్రియసఖి స్నేహా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు.
తల మీద జీలకర్ర, బెల్లం పెట్టే ముహూర్త సమయం వరకు వేచి వున్న బాలకృష్ణ, మోహన్ బాబు దంపతులు, 'ఈనాడు' రామోజీరావు, తనయుడు కిరణ్, దాసరి నారాయణ రావు తదితరులు వధూవరులపై అక్షింతలు వేసి దీవించారు. అంతకు క్రితం నారా చంద్రబాబు నాయుడు, జైపాల్ రెడ్డి, డి.శ్రీనివాస్, కేశవరావు, జయప్రకాశ్ నారాయణ తదితర రాజకీయ ప్రముఖులు విచ్చేసి, నూతన దంపతులను ఆశీర్వదించారు. వివాహం జరుగుతున్నంత సేపు రామ్ చరణ్, రాణా మిత్ర బృందం బన్నీ దగ్గరే వుండి వేడుకను పర్యవేక్షించారు. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ లకు చెందిన ప్రముఖులతో బాటు, రాజకీయనాయకులు కూడా పలువురు ఈ వేడుకకు తరలి వచ్చారు. వివాహం చివర్లో బన్నీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసాడు. వేలాది మంది ఈ వేడుకకు రావడంతో మాదాపూర్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైటెక్స్ కి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ని క్లియర్ చేయడం పోలీసులకు కత్తి మీద సామైంది!


Click it and Unblock the Notifications











