‘ప్రేమకథాచిత్రమ్’ దర్శకుడు తానేనంటూ వివరణ
హైదరాబాద్ : 'ప్రేమకథాచిత్రమ్' సినిమాకి దర్శకుడు ప్రభాకరరెడ్డి అయితే.. క్రెడిట్ మొత్తం మారుతీ కొట్టేశాడని ఫిల్మ్ సర్కిల్స్ లో, మీడియాలో వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మీడియాకు మారుతి వివరణ ఇచ్చారు. కొన్ని పరిస్దితుల్లో ప్రభాకరరెడ్డి పేరు వేసానని అయితే,సినిమా రిలీజ్ అయ్యాక ... కష్టపడి సినిమా తీసినప్పుడు ప్రతిఫలాన్ని ఆశించడం తప్పుకాదని ఇంట్లోవాళ్లు నచ్చజెప్పడంతో... ఆ సినిమా దర్శకునిగా నేను బయటకు రాక తప్పలేదు అంటూ పూర్తి స్ధాయిలో వివరణ ఇచ్చారు.
మారుతి మాటల్లోనే..." ఆ విషయం చెప్పేముందు.. ఈ సినిమాకు ముందు జరిగిన ఓ సంఘటన గురించి చెప్పాలి. 'ప్రేమకథాచిత్రమ్' నిర్మాత సుదర్శన్‌రెడ్డి.. 'ఈ రోజుల్లో' నుంచీ నాకు పరిచయం. 'ఈ రోజుల్లో' చిత్రాన్ని వైజాగ్‌లో రిలీజ్ చేయాలనుకున్నారాయన. అనుకోకుండా ఎడిటింగ్ రూమ్‌లో ఆ సినిమా చూశారు. ఇది ఆడే ప్రసక్తే లేదని, అట్టర్‌ఫ్లాప్ సినిమా అని తేల్చిపారేశారు. ఆయన అభిప్రాయం అదైనప్పుడు ఆయనకే వైజాగ్ అమ్మడం కరెక్ట్ కాదని, వేరే వాళ్లకు ఆ సినిమా ఇచ్చాం.

ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. కొన్నవాళ్లకు విపరీతమైన లాభాలు తెచ్చిపెట్టింది. సుదర్శన్‌రెడ్డి అప్పుడు నిజంగా షాక్ అయ్యారు. 'ఇంత హిట్ సినిమాను ఏ దృష్టితో చూశాను' అని బాధపడిపోయారు. అప్పుడే తనకు ఓ సినిమా చేసిపెట్టమని అడిగారు. 'బస్‌స్టాప్' షూటింగ్ టైమ్‌లో అయిదులక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. నేనేమో అప్పటికే గీతా ఆర్ట్స్‌వారికి కమిటై ఉన్నాను. ఇచ్చిన మాట ప్రకారం మూడో సినిమా గీతా ఆర్ట్స్‌కే చేయాలి. అందుకే...' కథ, మాటలు ఇచ్చి.. నా కోై-డెరెక్టర్ రాజేష్‌తో సినిమా చేయిస్తాను' అని చెప్పాను. ఆయన 'ఓకే' అన్నారు. హీరోగా సుధీర్‌బాబుని ఫైనల్ చేశారు.
అయితే... సుధీర్‌బాబు మాత్రం నేను డెరైక్ట్ చేస్తేనే సినిమా చేస్తానన్నాడు. 'నేనే డెరైక్ట్ చేస్తాను కానీ.. పేరు మాత్రం వేసుకోలేను' అని సుధీర్‌కి నిర్మొహమాటంగా చెప్పేశాను. చివరకు ఎలాగో అంగీకరించాడు. అయితే... మా కో-డెరైక్టర్ రాజేష్ మాత్రం ఇబ్బందిగా ఫీలయ్యాడు. 'మీరు డెరైక్ట్ చేస్తుంటే నేను పక్కన ఉండటం, పేరు మాత్రం నాది వేయడం ఇబ్బందిగా ఉంటుంది. నేను ఈ సినిమా చేయలేను' అనేశాడు. అలాంటి టైమ్‌లో.. మా కెమెరామేన్ ప్రభాకరరెడ్డి.. ఆయనంతట ఆయనే వచ్చి.. 'ఎవరి పేర్లో దేనికి? నా పేరు వేసుకో. నా కెలాంటి అభ్యంతరం లేదు' అని చెప్పడంతో... ప్రభాకరరెడ్డిగారి పేరు మీద 'ప్రేమకథాచిత్రమ్' డెరైక్ట్ చేశాను.
అయితే.. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ సినిమా డెరైక్టర్‌గా నా పేరు లేకపోవడం ఇంట్లోవాళ్లకు కూడా బాధ కలిగించింది. కష్టపడి సినిమా తీసినప్పుడు ప్రతిఫలాన్ని ఆశించడం తప్పుకాదని ఇంట్లోవాళ్లు నచ్చజెప్పడంతో... ఆ సినిమా దర్శకునిగా నేను బయటకు రాక తప్పలేదు. ఈ విషయంలో నాకు సహకరించిన ప్రభాకరరెడ్డిగారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అని చెప్పారు.


Click it and Unblock the Notifications











