వెంకటేష్-రామ్ ‘మసాలా’ ఆడియో వాయిదా
హైదరాబాద్ : వెంకటేష్, రామ్ హీరోలుగా బాలీవుడ్‌లో విజయం సాధించిన 'బోల్ బచ్చన్'కి రీమేక్‌గా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అంజలి, షాజన్ పదమ్‌సీ హీరోయిన్స్. విజయ్‌భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రానికి 'మసాలా' అనే టైటిల్ ఖరారు చేసే యోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.
ఈచిత్రం ఆడియో ఆగస్టు 23న అని నిర్ణయించారు. అయితే అనుకోకుండా ఏర్పడ్డ సమస్యల వల్ల ఆడియో విడుదల తేదీ వాయిదా పడిందని, త్వరలో ఆడియో డేట్ ప్రకటిస్తామని ఈ చిత్ర హీరో రామ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రామ్ సినిమాలపై తన మనోగతం గురించి వెల్లడిస్తూ 'నేను దర్శకుణ్ణి నమ్మి సినిమాలు చేస్తాను. ఫలానా కథ కావాలని ఏ దర్శకుణ్ణి కోరను. ఎందుకంటే నటుడిగా నేను ఒక్క కోణంలోనే ఆలోచిస్తాను. దర్శకులు వారి సృజనకు అనుగుణంగా నన్ను సరికొత్త పంథాలో ఆవిష్కరించాలని ఆలోచిస్తారు. కథ నచ్చితే దానికి వందశాతం న్యాయం చేయడంపైనే నేను దృష్టిపెడతాను' అని చెపుతున్నారు రామ్.
సోలోగా సినిమాలు చేయడం వల్ల అంతగా కలిసి రాక పోవడంతో మల్టీ స్టారర్ సినిమాలపై దృష్టి సారించిన వెంకటేష్....అలాంటి స్క్రిప్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. హిందీలో రూపొందిన 'బోల్ బచ్చన్'లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. 'మసాలా' చిత్రంలో అజయ్ దేవగన్ పాత్రలో వెంకీ కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications












