విదేశాలలో మాయాబజార్
మాయాబజార్ - మిత్, మ్యాజిక్ అండ్ మనీ - చిత్రం సర్వజనరంజకంగా రూపుదిద్దుకుంటూ జనం నవంబర్ 10న ముందుకు రావడానికి సర్వసన్నద్ధం అవుతోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ చెబుతూ - ఒక సామాన్య యువకుడికి హఠాత్తుగా అదృష్టం వరించి కోట్ల రూపాయలకు అధిపతి అయిపోతే ఎలా ఉంటుంది? అసలు అటువంటి పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారణం ఏమిటి? అన్న కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నట్టు తెలియజేశారు.
రాజా, భూమిక తొలిసారి జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై భూమిక సెంటిమెంట్ కూడా పనిచేస్తుందని అంటున్నారు. భూమిక నటించిన ఒక్కడు, ఖుషి, సింహాద్రి చిత్రాలు బ్లాక్‌బస్టర్ మూవీస్ అయ్యాయి. వాటి విజయాలకు భూమిక సెంటిమెంట్ కూడా ఒక కారణం అంటారు ఇండస్ట్రీ వర్గాలు. ఒక్కడు మహేశ్‌బాబుకు ఏడో చిత్రం కాగా, ఖుషి పవన్ కల్యాణ్‌కు ఏడో చిత్రం. సింహాద్రి ఎన్టీఆర్‌కు ఏడో చిత్రం. ఇప్పుడు మాయాబజార్ కూడా హీరో రాజాకు ఏడో చిత్రం. కాబట్టి భూమిక సెంటిమెంట్ ఈ చిత్రానికి కూడా వర్తిస్తుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, ఇప్పటికే మార్కెట్‌లోకి విడుదలైన మాయాబజార్ ఆడియో దర్శక-నిర్మాతల అభిరుచికీ, సంగీత దర్శకుడు కె.ఎమ్. రాధాకృష్ణన్ ప్రతిభకు అద్దం పడుతోంది.
ఈ చిత్రంలో ఇంకో ముఖ్యమైన విషయం - స్వర్గీయ డి.వి. నరసరాజు పనిచేసిన ఆఖరి చిత్రం మాయాబజార్ అవుతుంది. దొంగ రాముడు, రాజ మకుటం, గుండమ్మ కథ, భక్త ప్రహ్లాద, రంగుల రాట్నం, యమగోల, మనసు మమత వంటి ఎన్నో హిట్ చిత్రాలకు స్క్రిప్ట్, మాటలు అందించిన నరసరాజు చివరిగా మాయాబజార్ స్క్రిప్ట్ మీద పనిచేశారు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం విజయంపై నమ్మకంగా ఉన్నారు - అమెరికాకు చెందిన గ్రేట్ మూవీస్ మరియు రాఘవేంద్ర మీడియా సంస్థ వారు. మాయాబజార్ ఓవర్సీస్ స్క్రీనింగ్, డివిడి, వీడియో హక్కులను ఈ సంస్థలు సొంతం చేసుకున్నాయి.
మాయాబజార్ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. నవంబర్ 10న విడుదలకు సన్నద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications