మీరా జాస్మిన్ 'మోక్ష' ఎంతదాకా వచ్చింది?
మీరా జాస్మిన్ ప్రధానపాత్రలో చేస్తున్న హర్రర్ చిత్రం 'మోక్ష'. బ్లాక్ అండ్ వైట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. పి అమర్ నాథ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. ఈ సందర్బంగా నిర్మాత మీడియాతో మాట్లాడుతూ" తన అభినయంతో అలరించిన మీరా జాస్మిన్ ఇప్పుడు తొలిసారిగా నటిస్తున్న హారర్ చిత్రమిది. లేడీ ఓరియంటెడ్ గా సాగే ఈ చిత్రంలో ఆమె పాత్ర ఎంతో కీలకంగా వుంటుంది. గత రెండు నెలలుగా రామోజీ ఫిల్మ్‌సిటీలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో క్లైమాక్స్, పాటలు మినహా షూటింగ్ పూర్తవుతుంది. ఇదే నెలలో క్లైమాక్స్‌ను, పాటలను చెన్నయ్‌లో చిత్రీకరిస్తాం' అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ "ఆసక్తికరమైన కథ, ఉత్కంఠను కలిగించే కథనం ఈ చిత్రానికి ప్రధాన బలం. గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత వుండే చిత్రమిది' అన్నారు. హీరోయిన్ మీరా జాస్మిన్ మాట్లాడుతూ" ఇప్పటి వరకు నేను పోషించనటుంటి వైవిధ్యమైన పాత్ర ఇది. హారర్ కథాంశ చిత్రాల్లో ఇదొక వైవిధ్యమైన చిత్రంగా వుంటుంది' అని తెలిపారు. రాజీవ్ మోహన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, రాహుల్ దేవ్, దిశ, సన, కాదల్ సుకుమార్, విజయ్ భాస్కర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











