ఒక అమ్మాయి, నలుగురు అబ్బాయిల చుట్టూ నడిచే కథతో మీరా జాస్మిన్ కథానాయికగా "ఒకటి నాలుగు" సినిమా షూటింగ్ మొదలైంది. బుధవారం హైదరబాద్‌లో జరిగిన ప్రారంభ ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి. రామానాయుడు క్లాప్‌నివ్వగా, రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి "గమ్యం" దర్శకుడు క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. రాజ్ కంబైన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్ర లో మీరా జాస్మిన్ నటిస్తుండగా, నలుగురు కుర్రవాళ్ళ పాత్రల్ని కొత్తవాళ్లు చేస్తున్నారు. ఇంకా ఇతర పాత్రల్లో నరేష్, బ్రహ్మానందం, ధర్మవరపు, శ్రీనివాసరెడ్డి, మేల్కోటే, సన, హేమ తదితరులు కనపడనున్నారు. "పెళ్లైన కొత్తలో" ఫేమ్ అగస్త్య సంగీతం సమకూరుస్తుండగా, ఎ. రాజా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.