సినిమా గ్రాండ్ సక్సెస్... మెగా ఫ్యాన్స్ రక్తదానం
హైదరాబాద్: గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మెగా అభిమానులు రక్త దాన కార్యక్రమం నిర్వహించారు. ముషీరాబాద్‌లోని ఖుషీష్ ఫంక్షన్ హాల్‌లో శనివారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నూర్ మహ్మద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్శహించారు.
ఈ కార్యక్రమానికి సినీ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం సభా వేదికపై భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. మెగా ఫ్యామిలీపై అభిమానం ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ మేనేజర్ రామారావు మాట్లాడుతూ 'గబ్బర్ సింగ్' చిత్రానికి మా థియేటర్లో కోటి రూపాయల కలెక్షన్ వచ్చిందని తెలిపారు. మరో కార్యక్రమంలో నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని షాద్ నగర్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











