రాజమౌళి ఇంట్లో నేల మీద, ఎన్టీఆర్‌ని చూసి షాక్.. RRR ఎలా మొదలైందో చెప్పిన రాంచరణ్!
Recommended Video

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ముందుగా ఆర్ఆర్ఆర్‌ని వర్కింగ్ టైటిల్‌గా భావించారు. దానినే అసలు టైటిల్‌గా కొనసాగిస్తున్నట్లు రాజమౌళి తాజాగా మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ పూర్తి టైటిల్‌ని త్వరలో ప్రకటిస్తాం అని తెలిపాడు. ఈ చిత్రం ఎలాంటి కథతో తెరకెక్కుతోంది, ఇతర నటీనటులు ఎవరు అనే విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు ఆర్ఆర్ఆర్ టీం గురువారం రోజు మీడియా సమావేశం నిర్వహించింది. రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రాంచరణ్, నిర్మాత డివివి దానయ్య ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. రాంచరణ్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ చిత్రం ఎలా ప్రారంభమైందో వివరించాడు.

రియాలిటీలో లేను
రాంచరణ్ మాట్లాడుతూ.. తాను ఇప్పటికి రియాలిటీలో లేను అని తెలిపాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో తాను భాగం కావడం, మగధీర తర్వాత రాజమౌళి గారితో నటిస్తుండడం చాలా సంతోషాన్నిచ్చే విషయం అని రాంచరణ్ తెలిపాడు. అదే సమయంలో నా బెస్ట్ ఫ్రెండ్ ఎన్టీఆర్‌తో కలసి నటిస్తుండడం కొత్త అనుభూతిని ఇస్తోందని రాంచరణ్ తెలిపాడు. మాకు తెలిసిన దానయ్యగారి నిర్మాణంలోనే ఈ చిత్రం తెరకెక్కుతోందని రాంచరణ్ తెలిపాడు.

వేరే ఊరు వెళుతున్నా
కొన్ని నెలల క్రితం రాజమౌళి గారు ఫోన్ చేశారు అని రాంచరణ్ అనగానే.. ఒక సంవత్సరం గడచిపోయింది అని రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. మీతో పనిచేస్తుంటే సమయం తెలియడం లేదు సర్ అని చరణ్ సరదాగా వ్యాఖ్యానించాడు. నేను పనిమీద వేరే ఊరు వెళుతున్నా. ఆ సమయంలో రాజమౌళిగారు ఫోన్ చేసి విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఒకసారి ఇంటికి వచ్చి వేళ్ళు అని అడిగారు. రాజమౌళిగారి ఇంటికి వెళ్ళగానే లోపల ఓ గదిలో ఎన్టీఆర్ నేలమీద మంచి ఫోజులో కూర్చుని ఉన్నాడు. ఎన్టీఆర్‌ని చూసి షాక్ అయ్యా.

కథ అప్పుడే
నేను వచ్చాను ఏంటని ఎన్టీఆర్ కూడా ఆశ్చర్యపోయాడు. మీరిద్దరూ ఏమైనా మాట్లాడుకోవాలా నేను బయటకు వెళతా.. నాకింకా ఫ్లైట్‌కి టైం ఉంది అని అన్నాను. కాస్త ఓపిక పట్టు మీ ఇద్దరితో మాట్లాడాలి అని కూర్చోబెట్టి ఆర్ఆర్ఆర్ కథ చెప్పడం జరిగింది. నేను, ఎన్టీఆర్ చాలా సంతోషంతో రాజమౌళిని గట్టిగా పట్టుకున్నాం. ఆ మరుక్షణమే మేము ముగ్గురం సోఫాలో కూర్చుని ఉన్న ఫోటో తీసి సినిమాని ప్రకటించినట్లు రాంచరణ్ తెలిపాడు.

ఎంతో బాధ్యతతో
నేను, తారక్ ఈ పాత్రలని ఎంతో బాధ్యతతో చేస్తున్నాం. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నట్లు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజమౌళి చెప్పినట్లుగానే ఇది ఫిక్షనల్ స్టోరీ అని చరణ్ తెలిపాడు. నేను, తారక్ కలసి నటించే అసలైన సన్నివేశాలు ఇంకా ప్రారంభం కాలేదని రాంచరణ్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











