మాటిమాటికి హీరోలు లోపలికెందుకు .. వాళ్లు అలిసిపోతే , సెట్‌లో కరెక్ట్ కాదు.. చిరంజీవి హాట్ కామెంట్స్
దాదాసాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య నాయుడు వంటి మహనీయుల కృషి ఫలితంగా భారతదేశంలో సినిమా ప్రవేశించింది. అప్పటి వరకు నాటకాలు, బుర్రకథలు, యక్షగానాలు, తోలు బొమ్మ లాటలు వంటి మాధ్యమాలతో ప్రజలు వినోదం పొందారు. తెరపై కదిలే బొమ్మలు, పాటలు వంటివి కొత్త అనుభూతిని ఇవ్వడంతో ప్రేక్షకులు సినిమాకు అడిక్ట్ అయ్యారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించడంతో పాటు నాటి సాంఘిక దురాచారాలపైనా అద్భుతమైన సినిమాలు వచ్చాయి.
క్రమక్రమంగా సినిమా భారతీయుల జీవితంలో భాగమై ఓ వ్యాపారంగా మారిపోయింది. అయినప్పటికీ సమాజంపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతోంది. స్మార్ట్‌ఫోన్ రాకతో అన్ని రంగాలు ప్రభావితమైనా సినిమాను ఢీకొట్టలేకపోయింది. అప్పటికీ, ఇప్పటికీ.. ఎప్పటికీ సినిమా సినిమానే . చిత్ర పరిశ్రమకు అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్, డీటీఎస్, డాల్బీలతో పాటు 4కే, త్రీడీ టెక్నాలజీతో సినిమా స్టాండర్డ్స్ పెరిగాయి. ఇంతటి సాధనా సంపత్తి ఉన్నప్పటికీ సినిమా వేగం మాత్రం తగ్గిపోయింది. ఏ సినిమా తీసుకున్నా ఏళ్లకు ఏళ్లు చిత్రీకరణలు జరుపుకుంటోంది, ఖర్చూ బాగా పెరుగుతోంది.

గతంలో 60 నుంచి 90 రోజుల్లోగా సినిమా షూటింగ్ పూర్తయ్యేది.. ఒక హీరో ఒకేసారి ఆరేడు సినిమాల్లో నటిస్తూ కార్మికులకు చేతినిండా పని కల్పించేవారు. సూపర్‌స్టార్ కృష్ణ మూడు షిఫ్టుల్లో పనిచేసి.. ఏడాదికి 18 సినిమాలు రిలీజ్ చేసి పరిశ్రమ కళకళలాడేందుకు తన వంతు పాత్ర పోషించారు. నేటికాలంలో కేరవాన్ కల్చర్ ఇండస్ట్రీలో బాగా ఎక్కువైంది. ఔట్‌డోర్ షూటింగ్‌కి వెళ్లినప్పుడు చిత్ర యూనిట్ ఇబ్బంది పడకుండా ఓ వ్యాన్‌లో సకల సౌకర్యాలు అందులోనే ఉంటాయి. నటీనటుల స్థాయిని బట్టి షూటింగ్ స్పాట్‌లో కేరవాన్‌లను నిర్మాతలే ఏర్పాటు చేయిస్తున్నారు.
రాను రాను ఈ పోకడ విశృంఖలంగా మారింది. ఔట్‌డోరే కాదు.. ఇండోర్‌లో అది కూడా స్టూడియోలలో షూటింగ్ ఉన్నా కేరవాన్ కావాల్సిందేనని నటీనటులు డిమాండ్ చేస్తున్నారు. హిరోలలో చాలా మందికి సొంతంగా కేరవాన్‌లు ఉన్నాయి.. అందులో సకల సదుపాయాలు ఉన్నాయి. షూటింగ్‌లు ఉంటే ఆ కేరవాన్‌లు హీరో ఎక్కడుంటే అక్కడికి పరుగులు తీస్తాయి. లేదంటే గ్యారెజీకే పరిమితం. అయితే ఈ కల్చర్ కరెక్ట్ కాదంటున్నారు సీనియర్ నిర్మాతలు. నటీతరంలో నటీనటులు చెట్ల కిందే కూర్చొనేవారని, కాలకృత్యాలు కూడా ఎలాగోలా కానిచ్చేవారని చెబుతుంటారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ కేరవాన్ కల్చర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, జర్నలిస్ట్ రాజీవ్ మాసంద్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెట్స్‌లో ఉన్నప్పుడు తాను మాటి మాటికి వెళ్లి కేరవాన్‌లో కూర్చోనని, సినిమాలో మెయిన్ క్యారెక్టర్ సెట్స్‌లో ఉంటేనే ఔట్‌పుట్ చాలా బాగా వస్తుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. కేవలం బట్టలు మార్చుకోవడానికి, వాష్‌రూమ్‌కి వెళ్లడానికి మాత్రమే నటీనటులు కేరవాన్‌ని ఉపయోగించాలని చిరు తెలిపారు. షాట్ పూర్తవ్వగానే నటీనటులు వెళ్లి 10 నిమిషాలు కేరవాన్‌లో కూర్చొంటారని.. వాళ్లని మళ్లీ పిలవడానికి చాలా టైం పడుతుందన్నారు. ఈ సమయంలో డైరెక్టర్, కెమెరామెన్ అలసిపోతారని మెగాస్టార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











