పవన్ కోసం రంగంలోకి దిగిన చిరంజీవి.. బాధపడుతున్న నా తల్లికి ఆ మాట చెప్పానంటూ!
కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం అవుతోన్న వారిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకడు. స్టార్ హీరోగా సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన ఆయన.. ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో తనదైన మార్కును చూపిస్తున్నాడు. అలా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో పొత్తు పెట్టుకోవడంతో పాటు కూటమిని గెలిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌పై మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఏం చెప్పారంటే!
పవన్‌కు మద్దతుగా వీడియో:మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు మద్దతుగా చిరంజీవి వీడియోను వదిలారు. అందులో ఆయన 'కొణిదెల పవన్ కల్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా అందరికీ మంచి చేయాలి.. మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడిగా ఉంటాడు. తనకంటే జనం గురించి ఆలోచించే మనస్తత్వం మా తమ్ముడు కల్యాణ్ బాబుది' అన్నారు.

జనాలకు కావాల్సింది తనే:ఇదే వీడియోలో చిరంజీవి 'ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కల్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు వద్ద పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందివ్వడం వంటివి చేశాడు. ఆ పనులు చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంటుంది' అని చెప్పారు.

అనవసరంగా మాటలు పడి:చిరంజీవి కొనసాగిస్తూ.. 'కల్యాణ్ బాబు సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు. రాజకీయాల్లోకి మాత్రం ఎంతో ఇష్టంతో వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది' అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు.

అమ్మకు ఆ మాట చెప్పాను:చిరంజీవి కంటిన్యూ చేస్తూ.. 'తమ్ముడి గురించి బాధ పడుతున్న అమ్మకు ఈ అన్నయ్య ఒక మాట చెప్పాడు. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధమమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అని చెప్పాను. మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లే ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టమని నమ్మి జనం కోసం జనసైనికుడు అయ్యాడు' అన్నారు.
చట్టసభల్లో వినిపించాలని:ఇదే వీడియోలో 'తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్. ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్ట సభల్లో ఆయన గొంతును మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో మీరు చూడాలంటే పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించాలి' అని చెప్పుకొచ్చారు.
వాళ్లను రిక్వెస్ట్ చేస్తూనే:చివర్లో చిరంజీవి 'పవన్ కల్యాణ్ సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కల నిజం చేస్తాడు. పిఠాపురం ప్రజలకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ కల్యాణ్‌ను గెలిపించండి. జైహింద్' అంటూ ముగించారు.


Click it and Unblock the Notifications











