'సైరా' టీంకు షాక్.. షూటింగ్‌ని అడ్డుకున్న ముస్లింలు, విగ్రహాల వలనే గొడవ!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి తనయుడు రాంచరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తుండడం విశేషం. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. నరసింహారెడ్డి వీరత్వాన్ని ప్రతిభింబించేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ కి సంబంధించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఉయ్యాలవాడ చరిత్ర ఆధారంగా
మెగాస్టార్ చిరంజీవి తొలిసారి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రంలో నటిస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.200 కోట్ల బడ్జెట్.. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగా చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్ చేస్తోంది.

సైరా టీంకు షాక్
కర్ణాటకలోని బీదర్ లో సైరా నరసింహారెడ్డి షూటింగ్ సోమవారం రోజు జరగవలసింది. కానీ షూటింగ్ కు ఊహించని అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. బీదర్ లోని బహమనీ కోటలో సైరా షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. అధికారుల నుంచి అనుమతి కూడా వచ్చింది. షూటింగ్ ప్రారంభించే సమయానికి స్థానికంగా ఉన్న ముస్లింలు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీనితో సైరా షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది.

కారణం ఇదే
బహమనీ కోటలో సైరా టీం హిందూ దేవుళ్ళ విగ్రహాలని షూటింగ్ కోసం ఏర్పాటు చేశారట. దీనితో ముస్లింల కోటలో హిందూ దేవుళ్ళ విగ్రహాలు ఎలా పెడతారు అని అభ్యంతరం వ్యక్తం చేశారు. షూటింగ్ జరపడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. అధికారులు స్థానికంగా ఉన్న ముస్లిం నాయకులతో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోయింది. సైరా చిత్ర షూటింగ్ జరిపేందుకు ససేమిరా అనడంతో ఇక చేసేది లేక చిత్ర యూనిట్ తిరుగుపయనమైనట్లు తెలుస్తోంది.

నిరాశతో
షూటింగ్ మధ్యలోనే నిలిచిపోవడంతో సైరా టీం నిరాశచెందినట్లు తెలుస్తోంది. షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన సెట్, సమయం అంతా వృధా అయింది. ఈ సన్నివేశాలకు సంబందించిన షూటింగ్ ని హైదరాబాద్ లోనే నిర్వహించాలని దర్శకుడు సురేందర్ రెడ్డి భావిస్తున్నారట. నగర శివారులో మంచి సెట్ నిర్మించి అందులో ఈ సన్నివేళల్ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











