సంచలన చిత్రం ‘సలాం బాంబే’రీరిలీజ్
ఈ విషయమై మీరానాయర్ మాట్లాడుతూ...'కొత్త తరం ప్రేక్షకులకు ఈ సినిమాను చూపించడం ఎంతో సంతోషంగా ఉంది. నేటికీ దీని కథ సజీవంగానే ఉంది' అని ఆమె అన్నారు. మరో సారి తన చిత్రం విడుదల అవుతుండడంతో దర్శకురాలు మీరా నాయర్ ఆనందోత్సాహాల్లో మునిగితేలుతోంది. ముంబై రెడ్‌లైట్ ప్రాంతంలో జరిగే కథ ఇది.
ముంబై రెడ్‌లైట్ ప్రాంతంలో వ్యభిచారులు, మాదకద్రవ్యాలు రవాణాదారులుగా పొట్టపోసుకునే అనాథ బాలల వ్యధాభరిత జీవితాలను సలాం బాంబే కళ్లకు కట్టినట్లు చూపెట్టింది. రూ.500 సంపాదించాక తిరిగి తల్లి ఒడికి చేరుకోవాలని తపించే కృష్ణ అనే బాలుడి కథను మీరా ఇందులో తెరకెక్కించారు. అంతేకాదు నిజంగా వ్యభిచారం చేస్తూ మాదకద్రవ్యాల రవాణాదారులుగా పనిచేసే బాలలనే ఇందులో చూపించారు.
వీరితోపాటు షఫీక్ అహ్మద్, ఇర్ఫాన్, రఘువీర్ యాదవ్, నానా పాటేకర్, చందాశర్మ, అనితా కన్వర్ వంటి ప్రముఖ నటులూ కనిపిస్తారు. సలాం బాంబేకు జాతీయ ఉత్తమచిత్రం, కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవం వంటి ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. పీవీఆర్ డెరైక్టర్స్ రేర్ సంస్థ ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లకు తీసుకువస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, పుణే, గుర్గావ్‌లోని పీవీఆర్ థియేటర్లలో సలాం బాంబే విడుదలవుతుంది. ఈతరం వారికి సలాం బాంబేను చూపించడానికే తమ ప్రయత్నమని పీవీఆర్ లిమిటెడ్ ఉన్నతాధికారి సంజీవ్ కుమార్ అన్నారు. వీధి బాలల దుర్భర జీవితాలను మీరా అత్యద్భుతంగా తెరకెక్కించారని, నిజమైన ముంబైని ఇందులో చూడవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
సలాం బాంబే, కామసూత్ర, మాన్ సూన్ వెడ్డింగ్, అమిలియా, న్యూయార్క్ ఐలవ్ యూ, ద పెరిజ్ ఫ్యామిలీ తదితర చిత్రాలకు మీరా నాయర్ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications












