పవన్ కళ్యాణ్ సినిమాలో....శ్రీదేవి మాజీ ప్రియుడు?
హైదరాబాద్: నిన్నటి తరం స్టార్ హీరోయిన్ శ్రీదేవి, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి మధ్య ప్రేమాయణం నడిచిందనేది రహస్యమేమీ కాదు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారనే వార్తలు సైతం అప్పట్లో వినిపించాయి. అయితే మిధున్ చక్రవర్తి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని వ్యక్తే అని చెప్పక తప్పదు.
తాజాగా మిధున్ చక్రవర్తి తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో నటించబోతున్నారు. ఆ సినిమా మరేదో కాదు...పవన్ కళ్యాణ్-వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న 'ఓ మై గాడ్' తెలుగు రీమేక్ అని తెలుస్తోంది. 'ఓ మై గాడ్' ఒరిజినల్ వెర్షన్లో మిథున్ చక్రవర్తి లీలాధర్ స్వామిజీ పాత్రలో నటించారు. తెలుగులో వెర్షన్లోనూ ఆయన అదే పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక దాదాపుగా పూర్తయింది. వెంకీ జోడీగా శ్రీయను ఎంపిక చేసారు. అదే విధంగా వెంకీ అసిస్టెంట్ పాత్రకు కృష్ణుడిని తీసుకున్నారు. ఇప్పటికే రామానాయుడు సినీ విలేజ్‌లో సినిమాకు సంబంధించిన మార్కెట్ సెట్ సైతం వేసారు. మరికొన్ని రోజుల్ల సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
ఈ చిత్రానికి 'దేవ దేవం భజే' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ, నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్లలో సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. 'తడాఖా' ఫేం డాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తారు.


Click it and Unblock the Notifications











