రాజకీయం ఒక రొచ్చు.. ఓట్లు, సీట్లు కొనలేం.. రజనీకాంత్‌పై మోహన్ బాబు కామెంట్స్
రజనీకాంత్ రాజకీయంగా వెనకడుగు వేయడంతో కొంత మంది సంతోషించారు.. చాలా మంది వ్యతిరేకించారు. అభిమానులు మాత్రం నిరాశచెందారు. రజనీ సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు మాత్రం ఆ నిర్ణయాన్ని సమర్థించారు. రాజకీయాల్లోకి రావడం లేదు.. పార్టీ పెట్టడం లేదనే నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. తాజాగా రజనీకాంత్ నిర్ణయంపై మోహన్ బాబు స్పందించాడు.
Recommended Video

రాకపోవడం మంచిది
రజనీకాంత్ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగతి మీకందరికీ తెలుసు. తన ఆరోగ్యరీత్యా పాలిటిక్స్‌లోకి రావట్లేదు అని ప్రకటించాడు. ఒకరకంగా తన రాజకీయాల్లోకి రాకపోవడం మీు, అభిమానులందరికీ బాధే అయినప్పటికీ.. ఒక స్నేహితుడిగా తన ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా తన రాజకీయాల్లోకి రాకపోవడం మంచిది అని నమ్ముతున్నానంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.

రాజకీయాలు పనికిరావు..
నా మిత్రుడితో ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నువ్వు చాలా మంచి వాడివి.. చీమకు కూడా హాని చేయని వాడివి.. నా దృష్టిలో ఒన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్.. నీలాంటి వ్యక్తికీ, నాలాంటి వ్యక్తికి రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడతాం. ఎవరికీ ద్రోహం చెయ్యమని మోహన్ బాబు పేర్కొన్నాడు.

ఓట్లు సీట్లు కొనలేం
డబ్బులిచ్చి ఓట్లు, సీట్లు కొనలేము. కొనము కూడా. ఇక్కడి ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియదు. రాజకీయాల్లోకి రానంత వరకు మంచివాడివి అన్ననోళ్లే.. రేపు వచ్చాక చెడ్డవాడివి అంటాయి. రాజకీయం ఒక రొచ్చు. ఒక బురద.. ఆ బురద అంటుకోకుండా నువ్వు రాకపోవడం మంచిది అయిందంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.

అర్థం చేసుకుంటారని ఆశిస్తూ..
రజనీకాంత్ అభిమానులందరూ రజనీకాంత్ అంత మంచి వాళ్లు. మీరందరూ సహృదయంతో నా మిత్రుడి నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ.. మీ మోహన్ బాబు అంటూ ఓ పోస్ట్ చేశాడు. గత కొన్ని రోజులుగా రజనీకాంత్ రాజకీయ నిర్ణయంపై హాట్ డిబేట్లు నడుస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











