వంద రూపాయల అప్పు.. వడ్డీతో ఇచ్చేయ్ అనేవారు.. ఎస్పీబీపై మోహన్ బాబు ఎమోషనల్
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. కోట్ల మంది అభిమానుల్ని ఒంటరి చేసి స్వర్గానికి పయనమయ్యారు. ఆగస్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆరోగ్యం మాత్రం కుదుటపడేలేదు. నిన్న సాయంత్రం పరిస్థితి విషమించడంతో నేడు (సెప్టెంబర్ 25) ఒంటి గంట నాలుగు నిమిషాలకు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఇక ఈ వార్త తెలిసిన వెంటనే మోహన్ బాబు ఎస్పీబీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

అలా మొదలైన స్నేహం..
నాకు అత్యంత ఆత్మీయుడు, ఆప్త మిత్రుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. మేమిద్దరం కలిసి శ్రీకాళహస్తిలో కొన్నాళ్లు చదువుకున్నాం. అప్పటి నుంచి మేం మంచి ఫ్రెండ్స్‌మి. చాలా కలివిడిగా ఉండేవాళ్లం. కాలక్రమంలో ఇద్దరం సినీ రంగంలో అడుగుపెట్టాం. ఆయన గాయకుడైతే.. నేను నటుడ్నయ్యాను. శ్రీకాళ హస్తిలో మొదలైన మా స్నేహం.. ఆత్మీయత చెన్నైలోన కొనసాగింది. అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.

కరోనా కారణంగా..
శ్రీ విద్యానికేతన్‌లో ఏ కార్యక్రమం జరిగినా బాలు రావాల్సిందే. గత మార్చి 19 నా పుట్టినరోజున శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవానికి కూడా ఆయన హాజరు కావాల్సింది. కరోనా మహమ్మారి కారణంగా ఆ కార్యక్రమం క్యాన్సిల్ కావడంతో రాలేకపోయారు. ఈ మధ్య కూడా ఫోన్‌లో ఇద్దరం కొద్దిసేపు ముచ్చటించుకున్నాం. అని మోహన్ బాబు గుర్తుకు చేసుకున్నాడు.

ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి..
ఆయన ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు.. అన్ని దేవుళ్ల పాటలు పాడి ఆ దేవుళ్లందర్నీ మెప్పించిన గాన గంధర్వుడు. ఏ దేవుడి పాట పాడితే ఆ దేవుడ మన ముందు ప్రత్యక్షమైనట్టే ఉంటుంది. అలాంటి దిగ్గజ గాయకుడిని కోల్పోవడం యావత్ సినిమా ఇండస్ట్రీకే కాదు.. యావద్దేశానికి ఎంతో బాధాకరం. నాకు వ్యక్తిగతంగా ఎంతో లోటు. నా సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. నా చెవుల్లో ఆయన పాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. నా హృదయంలో ఆయన ఎప్పుడూ ఉంటారు. అని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.

వంద రూపాయల అప్పు..
ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలనిపిస్తోంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసే కాలంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాను. అప్పుడు బాల సుబ్రహ్మణ్యం దగ్గరకు వెళ్లి వంద రూపాయలు అడిగి తీసుకున్నాను. మేం కలుసుకున్నప్పుడల్లా ఇప్పటికీ ఆ వంద రూపాయల విషయం ప్రస్థావించి.. ‘వడ్డీతో కలిసి ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా! వడ్డీతో సహా నా డబ్బులు నాకు ఇచ్చేయ్' అని సరదాగా ఆటపట్టించే వారు. అని మోహన్ బాబు తెలిపాడు.
Recommended Video

ఎంతో బాధించింది..
ఈ మధ్య అంతటి స్నేహం, సన్నిహితత్వం ఉంది. అలాంటి మంచి స్నేహితుడ్ని కోల్పోయాను. మనిషనే వాడికి ఎప్పుడు.. ఎక్కడ ఎలా అవుతుందనే తెలీదు. బాలు మరణం నన్నెంతో బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











