నా కథనే వాళ్లు కాపీ కొట్టారు అన్నాడు : మోహన్ బాబు
హైదరాబాద్ : రవి అనే రచయిత దగ్గర్నుంచి కథ కొనుక్కున్నాం. ఆ తర్వాత ఆ కథ 'గోల్‌మాల్ 3' లాగా ఉందని మా రైటర్స్ చెప్పారు. ఈ విషయాన్నే అతన్నడిగాం. అతను 'లేదండీ. నా కథనే వాళ్లు కొట్టేశారు. నా కథని రైటర్స్ అసోసియేషన్‌లో రిజిస్టర్ కూడా చేయించాను. ఏదేమైనా ఈ కథకు బాధ్యత నాదే' అని చెప్పాడు. మేం అతన్ని నమ్మాం. ఈ సినిమా రిలీజయ్యాక 'గోల్‌మాల్ 3'కి కాపీయో, కాదో మీరే చెప్పాలి అంటూ మోహన్ బాబు తన తాజా చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద' కథ కాపీ వివాదంపై స్పందించారు.
చిత్రంలో తన పాత్ర గురించి చెప్తూ.... నా పాత్ర పేరు నాయుడు. నా పాత్ర నోటికి దురుసు ఎక్కువ. చేతికి దురదెక్కువ. సినిమాలో విష్ణు రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తాడు. మనోజ్ స్త్రీ పాత్రలో కనిపిస్తాడు. బృహన్నలగా ఎన్టీఆర్‌గారికి ఎంత పేరు వచ్చిందో ఇందులో మోహినిగా మనోజ్‌కి అంతటి పేరు వస్తుంది. సినిమా ద్వితీయార్ధంలో మనోజ్ మోహినిగా విజృంభిస్తాడు. ఇప్పటివరకూ నా జీవితంలో నటించని పాత్ర ఇది. మా పాత్రల చిత్రణ హిందీలో వచ్చిన 'గోల్‌మాల్3'కి దగ్గరగా ఉన్నాయని కొందరు అంటున్నారు. కానీ రెండింటికీ సంబంధం లేదు అన్నారు.

అలాగే...''నేను పూర్తిస్థాయి ప్రధాన పాత్రలో నటించి పదేళ్లవుతోంది. నా కొడుకులు హీరోగా మంచి స్థానంలోకి వచ్చారు. ముగ్గురం కలసి నటిద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కథ కోసం ఇన్నాళ్లు ఆగాం. 'రావణ' చేద్దామనుకుంటే దానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా చేశాం. మేం అనుకున్నట్లుగా సినిమా చక్కగా వచ్చింది. రవి, కోనవెంకట్, బీవీఎస్‌రవి, గోపీమోహన్ చక్కటి కథని సిద్ధం చేశారు. దాన్ని శ్రీవాస్ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మంచు విష్ణు, మనోజ్, వరుణ్‌సందేశ్, తనీష్, రవీనాటాండన్, హన్సిక, ప్రణీత తమ పాత్రలమేరకు చక్కటి ప్రతిభకనబర్చారు. ఇంటిల్లిపాది చూసే సినిమాగా నిలుస్తుంది.'' అన్నారు.
ఇక సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ శ్రీవాస్ చాలా బాగా తీశాడు. సాధారణంగా నా సినిమాని ముందుగా ఎవరికీ చూపించను. 'నువ్వు, విష్ణు, మనోజ్ మొదటిసారిగా కలిసి నటించారు. రష్ చూడాలి' అని గురువుగారు (దాసరి) అన్నారు. భయపడుతూనే చూపించా, ఏం చెబుతాడోనని. చూసి 'ఎక్సలెంట్' అన్నారు. ఒక చిన్న సూచన మాత్రం చేశారు, డైరెక్టర్‌కి. దానికి రీషూట్ అవసరం లేదు. ఒక షాట్‌ని మార్చుకోవాలంతే. రీరికార్డింగ్ అయ్యాక బయటివాళ్లకి చూపించా. ఈ సందర్భంగా ఓ సంగతి చెప్పాలి. మన ఫిల్మ్‌చాంబర్ ప్రివ్యూ థియేటర్ పరమ చెత్త, నీచాతి నికృష్టంగా తయారైంది. ఆ థియేటర్‌లో సినిమాకి సంబంధంలేని బయటివాళ్లని పిలిచి సినిమా వేశాను. అందరూ 'బ్రహ్మాండం' అన్నారు. తృప్తిగా ఉంది. ఇక ఫలితం భగవంతుడి చేతుల్లో ఉంది అని చెప్పుకొచ్చారు.
శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.


Click it and Unblock the Notifications











