ఎవడి సొమ్ము అది, అహంకారం పనికిరాదు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ మోహన్ బాబు!
శ్రీ విద్యానికేతన్ సంస్థకు రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విషయంలో మోహన్ బాబు గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. శుక్రవారం రోజు తన విద్యాసంస్థ విద్యార్థులతో కలసి ప్రభుత్వనికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించాలని మోహన్ బాబు నిర్ణయించారు. ర్యాలీ ప్రారంభించడానికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ర్యాలీ అడ్డుకునేందుకు పోలీసులు భారీగా తిరుపతిలోని విద్యానికేతన్ సంస్థవద్దకు చేరుకున్నారు. మోహన్ బాబుని హౌస్ అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నించినట్లు ఈ ఉదయం వార్తలు వచ్చాయి. కానీ మోహన్ బాబు వెనకడుగు వేయకుండా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.

అనుమతి లేదు
ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ర్యాలీకి అనుమతి ఇవ్వలేం అని పోలీసులు మోహన్ బాబుతో చెప్పారు. అయినా కూడా మోహన్ బాబు తన తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. వ్యర్థ వాగ్దానాలు ఆపండి. విద్యార్థుల ఫీజులు సకాలంలో చెల్లించండి అనే ప్లకార్డుని పట్టుకుని మోహన్ బాబు నిరసన వ్యక్తం చేశారు. విష్ణు, మనోజ్ ఇద్దరూ తన తండ్రి వెంట నడిచారు.
Recommended Video


అతను ముఖ్యమంత్రి కాదు
ఈ ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు అంటూ మీడియా ప్రశ్నించగా.. చంద్రబాబు ఒకప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు కాదు.. ప్రస్తుతం అతడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. పోలీసులు కూడా అతడి మాట విననవసరం లేదు అని మోహన్ బాబు అన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో వ్యర్థ వాగ్దానాలు ఆపాలని అన్నారు. నాలుగున్నర ఏళ్లుగా ప్రజలని ఎలా ఏడిపించాడో అందరికి తెలుసు. త్వరలోనే అతడికి తగిన బుద్ది చెబుతారు అని మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అంటే ఇష్టం
వాస్తవంగా నాకు చంద్రబాబు అంటే ఇష్టం. అతడు కష్టాల్లో ఉన్న సమయంలో మా విద్యార్థులే ఆయన తరుపున పోరాటం చేశారు అని మోహన్ బాబు అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నని మీరు కూడా అడగండి. పిల్లల ఫీజులు ఎందుకు చెల్లించడం లేదు అంటే అమరావతి కడుతున్నా అంటాడు. మరి పసుపు కుంకుమ పథకానికి డబ్బు ఎలా వచ్చింది. ఆవు పథకానికి డబ్బు ఎలా వచ్చింది. అవుకు, ఎద్దుకు తేడా తెలియకుండా యాడ్ చిత్రీకరించారని మోహన్ బాబు సెటైర్లు వేశారు.

ఎవడి డబ్బురా అది
మా చంద్రన్న ఆవు ఇచ్చాడని కొందరు అంటున్నారు.. ఎవడి డబ్బురా అది అంటూ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇలాంటి వాగ్దానాలు ఇవ్వకూడదు. చంద్రబాబుకు సొంతంగా ఏమీ లేదు.. మూడెకరాలు తప్ప. ప్రజల నుంచి దోచుకున్న డబ్బే ప్రజలకు పంచుతున్నాడు అని మోహన్ బాబు అన్నారు.

అహంకారం పనికిరాదు
ప్రతి ఏడాది ఆరంభంలో ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలి. మూడు నెలలకు ఒకసారి ఇస్తానని చెప్పావు. కానీ ఇవ్వలేదు. ఎన్నిసార్లు లెటర్ రాసినా సమాధానం లేదు. మనిషికి అంత అహంకారం పనికిరాదు. నువ్వు సత్యహరిశ్చంద్రుడివి కాదు.. ధర్మరాజువీ కాదు. అదంతా నాకు అనవసరం.. నా డబ్బు నాకు చెల్లించు అని మోహన్ బాబు చంద్రబాబుని డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications











