ఆడకూతురనే ఆగాను, చిట్టా విప్పుతా: ధనలక్ష్మిపై మోహన్ బాబు
హైదరాబాద్: సెన్సార్ బోర్డు సభ్యురాలు ధనలక్ష్మి పైన గతంలో పలు విమర్శలు వచ్చినప్పటికీ తాను ఆడకూతురు అని ఊరుకున్నానని కానీ ఆమె అలా బిహేవ్ చేయడం లేదని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురువారం అన్నారు. ఆయన దేనికైనా రెడీ చిత్రంపై మాట్లాడారు. చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతుందని, తనకు ఆనందంగా ఉందన్నారు. నిర్మాతలను సెన్సార్ బోర్డు సభ్యులు వేధిస్తున్నారని ఆరోపించారు.
తెలుగు రాని వారు సెన్సార్ బోర్డులో ఉండటం బాధాకరమన్నారు. మన బాధలు తీర్చేందుకు వైయస్ రాజశేఖర రెడ్డియో, నారా చంద్రబాబు నాయుడు వంటి వారు రారని, మనమే మన సమస్యలపై పోరాడాలని సూచించారు. తాము ధనలక్ష్మిపై పోరాడి సినిమాను విడుదల చేసుకున్నామన్నారు. తన అనుమతి లేకుండా సినిమాను వేరే వారికి చూపించినందుకు, ఇక్కడకు రావడానికి ఆమెకు ఏ అర్హతలు ఉన్నాయనే దానిపై పోరాడుతామన్నారు.
తాము డిజిపి, లా అండ్ ఆర్డర్ డిజికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ధనలక్ష్మిపై పలు ఆరోపణలు ఉన్నాయని, ఆమె ఇక్కడకు ఎవరి సాయంతో వచ్చారో ఆరా తీస్తామన్నారు. ఆమె గురించి త్వరలో వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ధనలక్ష్మి నిర్మాతలను వేధించడం బాధాకరమన్నారు. బయటి వ్యక్తులకు తన అనుమతి లేకుండా సినిమాను ఎలా చూపిస్తారన్నారని ప్రశ్నించారు.
కాగా దేనికైనా రెడీ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతుందని, తనకు హ్యాపీగా ఉందన్నారు. తాము కష్టపడి సినిమా తీస్తే కొందరు పైరసీ చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితాలు రాకముందే పైరసీ చేసి అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











