కేసీఆర్‌తో సినీ నటుడు మోహన్ బాబు భేటీ, వారి భూములే టార్గెట్!
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కాబోతున్న టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)ను సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు బుధవారం కలిసారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు మోహన్ బాబు అభినందనలు తెలిపారు.
అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.... అన్న ఎన్టీఆర్ గారికి కేసీఆర్ అత్యంత సన్నిహితుడు అని తెలిపారు. కేసీఆర్‌తో తనకు ఉన్న స్నేహాన్ని ఈ సందర్భంగా మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. పేదల భూములు కొందరు ఆక్రమించుకున్నారని, వాటిని స్వాధీనం చేసుకోవాలని కేసీఆర్‌ను కోరినట్లు మోహన్ బాబు తెలిపారు.

కాగా...మోహన్ బాబు ఎవరి భూముల గురించి కేసీఆర్‌కు ఫిర్యాదు చేసారు? అనేది ఆసక్తి కరంగా మారింది. ఆయన సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తుల గురించి ఫిర్యాదు చేసినట్లు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వాల అండతో కొందరు సినీ ప్రముఖులు ఆక్రమించుకున్న పేదల భూములపై మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అయితే మోహన్ బాబు పనిగట్టుకుని వెళ్లి సదరు భూముల విషయమై ఫిర్యాదు చేయడం వెనక కారణం ఏమిటి? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆక్రమణల విషయం కొత్త ప్రభుత్వం చూసుకుంటుంది కదా? మెహన్ బాబు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమిటి? ఎవరిపై కోపంతో ఆయన ఈ ఫిర్యాదు చేసారు? అనేది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











