మోహన్ బాబు మీద అవన్నీ తప్పుడు వార్తలే...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు చేసిన ప్రముఖ నటుడు మోహన్ బాబు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల విషయంలో రోడ్డెక్కి ఆందోళన చేయడం సంచలనం అయింది. అనంతరం ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన మద్దతు ప్రకటిస్తూ వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
ఎన్నికల్లో వైసీసీ ఘన విజయం సాధించడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో.... మోహన్ బాబుకు ఏదో ఒక పదవి దక్కడం ఖాయం అనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన సంస్థ బాధ్యతలు ఆయనకు అప్పగించే అవకాశం ఉందని అంతా చర్చించుకున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎఫ్.డి.సి) చైర్మన్‌గా నటుడు, నిర్మాత, శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేత డా.మంచు మోహన్‌బాబును నియమించారని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని మోహన్‌బాబు పిఆర్ టీమ్ స్పష్టం చేసింది.
మోహన్ బాబు ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ రాజకీయాలకు వీలైనంత దూరంగా ఉంటున్నారు. తన విద్యానికేతన్ సంస్థకు సంబంధించిన బాధ్యతలు చూసుకుంటూ... సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సూర్యతో కలిసి ఓ తమిళ చిత్రం చేస్తున్నారు.
సూర్య హీరోగా 'సూరారై పొట్రు' అనే కొత్త సినిమా ఇటీవల మొదలైంది. మాధవన్‌తో 'సాలా ఖాదూస్', వెంకటేష్‌తో 'గురు' లాంటి బాక్సింగ్ నేపథ్యం ఉన్న చిత్రాలు తెరకెక్కించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో తెలుగు నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











