నా ఆస్తులు తాకట్టు పెట్టుకుంటున్నా.. ఈ ప్రభుత్వం వల్లే, మోహన్ బాబు సంచలనం వ్యాఖ్యలు!
Recommended Video

సీనియర్ నటుడు మోహన్ బాబు సినిమాల్లో నటిస్తూనే అప్పుడప్పుడూ రాజకీయ పరమైన వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మోహన్ బాబు పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ ఇద్దరూ సినిమాల్లో నటిస్తున్నారు. సినిమా నిర్మాణంలో కూడా మంచు ఫ్యామిలీ భాగమవుతూ ఉంటుంది. వీటితో పాటు మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ సంస్థల్ని కూడా నడిపిస్తున్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

విద్యాసంస్థలు నడిపిస్తూ
తిరుపతిలో మోహన్ బాబు కుటుంబం నడిపిస్తున్న విద్యానికేతన్ సంస్థలు ఉన్న సంగతి తెలిసిందే. చంద్రగిరిలో మోహన్ బాబు నేడు ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తాను విద్యానికేతన్ సంస్థల్ని నడిపించడానికి ఎంత కష్టపడాల్సి వస్తోందో వివరిస్తూ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి.

ఆస్తులు తాకట్టు పెట్టుకుంటున్నా
ఈ ప్రభుత్వం వల్ల తన ఆస్తులని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాల్సి వస్తోందని మోహన్ బాబు అన్నారు. శ్రీ విద్యానికేతన్ సంస్థల్ని నడిపించడానికి ఇలా చేయక తప్పడం లేదు. ప్రభుత్వం గత రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయడంలో జాప్యం చేస్తోంది. గత రెండేళ్లలో ప్రభుత్వం 20 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉందని మోహన్ బాబు అన్నారు.

6 కోట్ల ఖర్చు
విద్యాసంస్ధల నిర్వహణకు నెలకు 6 కోట్ల ఖర్చు అవుతోంది. ప్రభుత్వం నుంచి సహకారం లేకున్నా సిబ్బందికి సకాలంలో వేతనాలు అందిస్తున్నామని మోహన్ బాబు అన్నారు. గత 26ఏళ్లుగా తన విద్యాసంస్థలు కుల మతాలకు అతీతంగా నిరుపేద విద్యార్థులకు విద్యని అందిస్తోందని అన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండగా మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

రాజకీయాల్లోకి
త్వరలో మోహన్ బాబు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మోహన్ బాబు ఇటీవల సినిమాలలో నటించడం కూడా తగ్గించారు. మోహన్ బాబు చివరగా నటించిన చిత్రాలు మహానటి, గాయత్రి. మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్, కుమార్తె మంచు లక్ష్మి చిత్ర పరిశ్రమలో యాక్టీవ్ గా ఉన్నారు.


Click it and Unblock the Notifications











