దేనికైనా రెడీకి సెన్సార్ కష్టాలు: మోహన్‌బాబు సీరియస్
హైదరాబాద్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కథానాయకుడుగా నటించిన దేనికైనా రెడి చిత్రం సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాను శుక్రవారం సెన్సార్ సభ్యులకు చూపించారు. వారు ఎనిమిది కత్తిరింపులతో యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే నిన్న(సోమవారం) సర్ఠిఫికేట్ ఇచ్చే ముందు సెన్సార్ వివాదం ప్రారంభమైంది.
సోమవారం సర్టిఫికేట్ ఇచ్చే ముందు సెన్సార్ బోర్డు మరో ఇరవై కత్తిరింపులు చేయాలని సూచించారు. దీంతో వివాదం ప్రారంభమైంది. ఇప్పటికే నిర్మాతలు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చే ముందు మరో ఇరవై కత్తిరింపులు అని చెప్పడంతో సినిమా యూనిట్‌కు పాలు పోవడం లేదు.
దీంతో మోహన్ బాబు ఈ సినిమాను రివిజన్ కమిటీకి చూపించడానికి సిద్ధమయ్యారు. సెన్సార్ వాళ్ల ధోరణి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా ఉందని హీరో మంచు విష్ణు ఆరోపించారు. శుక్రవారం తాము సినిమా చూపించినప్పుడు వారు చూపించిన కట్స్ చేశామని, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయో చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు.
విడుదల తేదీని ప్రకటించామని, తేదీ దగ్గర పడిన తర్వాత ఇలా చేయడం సరికాదని, ఇలా ఇప్పుడు కొత్తగా కట్స్ చెప్పడం ఇబ్బందికరమేనని వారు చెబుతున్నారు. కాగా తొలుత సినిమా చూసిన సభ్యులు వేరు.. ఇప్పుడు అభ్యంతరాలు లేవనెత్తిన సభ్యులు వేరని తెలుస్తోంది.
మోహన్ బాబు సీరియస్
కాగా ఈ సినిమాకు అభ్యంతరం చెప్పిన సెన్సార్ అధికారి ధనలక్ష్మిపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దీనిపై కోర్టుకు వెళ్తామన్నారు. సినిమా విడుదలకు ముందు కొత్త కట్స్ చూపించడమేమిటని ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











