Mohan Babu: కులాలపై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్.. చెప్పుతో కొడాతనంటూ!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా విలన్ గా గుర్తింపు పొంది కలెక్షన్ కింగ్ అని పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు. ఆయన డైలాగ్ డెలీవరి విభిన్నంగా ఉండటమే కాకుండా ఎంతోమంది అభిమానులను సంపాదించిపెట్టింది. అందుకే ఆయన్ను నట ప్రపూర్ణగా అభివర్ణిస్తుంటారు.
ప్రస్తుతం అడపదడపగా సినిమాలు చేస్తున్న ఆయన ఎక్కువగా వారి సొంత యూనివర్సిటీ పనులు చూసుకుంటున్నారు. తాజాగా 77వ స్వాతంత్య్రదినోత్సవం వేడుకల సందర్భంగా కులాలపై మోహన్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జాతీయపతాకాన్ని: కలెక్షన్ కింగ్ మోహన్ (Mohan Babu) బాబు తాజాగా తమ యూనివర్సిటీలో 77వ స్వాతంత్య్రదినోత్సవ (Independence Day 2023) వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు (Manchu Vishnu) పాల్గొన్నారు. మోహన్ బాబు సొంతూరు మోదుగులపాలెం గ్రామస్థుల సమక్షంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు.

ఎవడు కనిపెట్టాడు: ఈ సందర్భంగా మీడియాతో మోహన్ బాబు మాట్లాడారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. చెట్ల ద్వారా వచ్చే ఆక్సిజన్. నీడ ఎంత గొప్పదో పది మందికి చాటి చెప్పాలి. గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని, మన తల్లిదండ్రులను మర్చిపోకూడదు. నేను మా ఊళ్లో నేను చదువుకునే రోజుల నుంచి నాకు కులాలంటే అసహ్యం. ఎవడు కనిపెట్టాడురా ఈ కులాలనీ. కర్మ. గ్రహచారం అని మోహన్ బాబు అన్నారు.

అంటరాని వాళ్లంటూ: "నేను అప్పుడు ఎనిమిదో, తొమ్మిదో తరగతి చదివేవాడిని. ఊరికి వచ్చినప్పుడు. ఏయ్ చెంగయ్యా రారా టీ తాగుదాం అని తీసుకెళ్లాను. ఇద్దరం టీ తాగిన తర్వాత చెంగయ్యను ఏయ్ పోయి గ్లాసు కడుక్కురా అని టీ కొట్టు అతను అన్నాడు. నేను ఆగమని చెప్పాను. నీకెం తెలుసయ్యా. ఎక్కడో చదువుకుంటున్నావ్. ఇప్పుడు వచ్చావ్ ఊరికి. వాళ్లు అంటరానివారు. వాళ్లను దగ్గరికి చేర్చకూడదు. వాళ్ల గ్లాసు మనం తాకకూడదు అని అన్నాడు" అని మోహన్ బాబు వివరించారు.

ఏ కులం అని చూడం: "టీకొట్టు అతని మాటలకు చెప్పు తీసుకుని కొడతానని అన్నాను. అతను గొడవ చేశాడు. చెంగయ్యను పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్లిపోయా. మళ్లీ మా నాన్నకు చెబుతారామే అని. ఆరోజు పంచాయితీ పెట్టారు. మా నాన్న నాతో మాట్లాడుతూ ఒరేయ్ నీకు నాకు ఒకే అలవాటు. నేను పాఠాలు చెబుతుంటాను. 30, 50 మందో పిల్లలు ఉంటారు. ఏ కులం అని చూడం మనం అని అన్నారు" అంటూ మోహన్ బాబు తెలిపారు.
చెప్పినా వినలేదు: "నేను అందరికీ బోధిస్తూ ఉంటాను. ఈ ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ, నేను చెప్పినా వినలేదు. నువ్వు ఇప్పుడు తిరగబడ్డా వాళ్లందరికీ నీ మీద కోపం. మనకెందుకు చెప్పు అన్నారు. లేదు నాన్నగారు మనసుకు కష్టంగా ఉంది. అందుకే అలా చేశాను. తప్పయిపోయింది అన్నాను. నాన్న పొలంలో పనికి పిలిచినా చెంగయ్య వచ్చేవాడు కాదు. నేను వెళ్లి రారా నాన్న కష్టపడుతున్నారు అని పిలుచుకువచ్చేవాడిని" అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

గ్రామం అక్కడే: మోహన్ బాబు మాటలకు మోదుగులపాలెం గ్రామస్థులంతా చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మోహన్ బాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా శ్రీకాళహస్తికి, తిరుపతికి మధ్యలో ఏర్పేడు ఉంది. ఏర్పేడు నుంచి రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లే సువర్ణముఖి నదిని దాటిన తర్వాత తమ గ్రామం మోదుగులపాలెం ఉంటుందని మోహన్ బాబు తెలిపారు.


Click it and Unblock the Notifications











