దేనికైనా రెడీ' వివాదం పై మోహన్ బాబు...
హైదరాబాద్ : 'దేనికైనా రెడీ' సినిమా వివాదానికి నెల్లూరులో మోహన్ బాబు మాటలు ఆజ్యం పోయటంతో అది పెరిగి పెద్దదైన సంగతి తెలిసిందే. అప్పటినుంచీ ఈ వివాదం విషయంలో మోహన్ బాబు దూరంగా ఉంటున్నారు. ఆయన మీడియా ముందుకు రావటానికి ఇష్టపడలేదు. అందులోనూ ఆయన హైదరాబాద్ లో కూడా లేరు. అయితే గురువారం తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా మోహన్‌బాబును ఆయన ఇంటివద్ద కలిసి ప్రశ్నించారు. జరిగిన ఘటనలపై స్పందించమని అడిగినప్పటికీ ఆయన మాట్లాడకుండానే ఇంట్లోకి వెళ్లిపోయారు.
అలాగే సిని పరిశ్రమలో ప్రముఖులు సైతం ఈ వివాదంపై మాట్లాడటానకి ముందుకు రావటం లేదు. సినిమాకు పనిచేసిన రచయితలు రవి,కోన వెంకట్,దర్శకుడు నాగేశ్వర రెడ్డి మాత్రం మీడియాలో ఈ చిత్ర వివాదంపై చర్చలకు హాజరవుతూ వాదిస్తున్నారు. బుధవారం రాత్రి మోహన్‌బాబు ఇంటివద్ద జరిగిన వ్యవహారంపై ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. బ్రాహ్మణులపై దాడి చేసిన సాయిప్రసాద్‌రెడ్డి, మరో ఐదుగురిపై 324, 506 సెక్షన్ల కింద, మోహన్‌బాబు ఇంటిపైకి వెళ్లినందుకు బ్రాహ్మణులపై 427, 502 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దాడిపై.. బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు హెచ్చార్సీకి ఫిర్యాదుచేశారు. బ్రాహ్మణుల మీద జరిగిన దాడులపై చర్యలు తీసుకునేలా సర్కారును ఆదేశించాలని హెచ్చార్సీని కోరేందుకు తెలంగాణ న్యాయవాదులు కూడా వచ్చారు.
'దేనికైనా రెడీ'ఈ సినిమాను నిషేధించాలని, తమపై దాడికి ప్రేరేపించిన సినీనటులు మోహన్‌బాబు, విష్ణులతోపాటు దాడి జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు మానవ హక్కుల సంఘం (హెచ్చార్సీ)లో నిన్న పిటిషన్ దాఖలు చేశాయి. వీరికి తెలంగాణ న్యాయవాదుల సంఘం మద్దతు పలికింది. మరోవైపు, విష్ణు కూడా తమ ఇంటిపై దాడికి వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా కమిషన్ కార్యాలయంలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
దేనికైనారెడీ సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. మోహన్‌బాబు క్షమాపణ చెప్పకపోతే ఆయన ఇంట్లో జరిగే ఏ శుభకార్యానికీ బ్రాహ్మణులెవరూ రారని హెచ్చరించారు. తిరుపతిలో బ్రాహ్మణ సమాజం నాయకులు చిత్రంపై నిరసన వ్యక్తం చేయగా, కొద్దిమంది సినిమాలో అభ్యంతరకర దృశ్యాలేవీ లేవని చెప్పారు.


Click it and Unblock the Notifications











