ప్రభుత్వ కమిటీ పై కోర్టుకు మోహన్ బాబు
హైదరాబాద్: ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేయండి అంటూ మోహన్ బాబు కోర్టుకు వెళ్లారు. 'దేనికైనా రెడీ' సినిమాను పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించడంపై ఆ చిత్ర నిర్మాణ సంస్థ 'ట్వంటీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్' తరుపున మోహన్ బాబు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఒక సినిమాకు సెన్సార్‌బోర్డు సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాత అందులో జోక్యం చేసుకొనేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు గతంలో ఓ కేసులో స్పష్టం చేసిందని ప్రస్తావించారు. ప్రభుత్వ ఉత్తర్వులతో పాటు సంబంధిత చర్యలన్నింటి నిలిపివేతకు ఆదేశించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
వివాదంలో చిక్కుకొన్న 'దేనికైనా రెడీ' సినిమాను ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ గురువారం సాయంత్రం వీక్షించింది. అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలను నమోదు చేశామని, వీటిపై శుక్రవారం చిత్రనిర్మాత మోహన్‌బాబు, హీరో విష్ణును పిలిపించి చర్చిస్తామని కమిటీ ఛైర్మన్ రేమండ్ పీటర్ తెలిపారు. కమిటీతో పాటు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కూడా సినిమాను తిలకించారు. ఇరువర్గాల వాదనలు విన్న తరవాత సమగ్ర నివేదికను ఈ నెల పదో తేదీలోగా ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన వెల్లడించారు.
చిత్ర పరిశ్రమకు కూడా కొన్ని సూచనలివ్వాలని కమిటీ భావిస్తోందని, కుటుంబ సమేతంగా సినిమాలు నిర్మించాలన్నది తమ అభిమతమని ఆయన చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ప్రేక్షకులు సినిమాను ఎలా చూడాలనుకుంటారో, నిర్మాతలు కూడా అలాగే తీయాలని చలనచిత్ర వాణిజ్య మండలి తరఫున నిర్మాతలకు, దర్శకులకు, రచయితలకు సూచనలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నేపధ్యంలో మోహన్ బాబు కోర్టుకు వెళ్లి ఆ కమిటీ నిర్ణయాన్ని సవాల్ చేసారు.


Click it and Unblock the Notifications











