twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాకు అవమానం: మోహన్‌బాబు

    By Staff
    |

    ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాతల మండలి ప్రవర్తించిన తీరుకు ఎట్టకేలకు ఒక గళం నిరసన వ్యక్తం చేసింది. అది కూడా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే మోహన్‌బాబు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడి హోదాలో తన విచారం వ్యక్తం చేయడం విశేషం. శుక్రవారం మా కార్యవర్గం సభ్యులు విలేఖరులతో ఇష్టాగోష్టి నిర్వహించినప్పుడు మోహన్‌బాబు ప్రకాశ్‌రాజ్‌ విషయం ప్రస్తావిస్తూ.. ప్రకాశ్‌రాజ్‌ విషయంలో నిర్మాతల మండలి వైఖరి మాకు మనస్తాపాన్ని కలిగించింది. ఇది ఎంతో బాధాకరం. దీనిని మేము ఖండిస్తున్నాం అన్నారు.

    మా కార్యవర్గ సభ్యులు పరుచూరి గోపాలకృష్ణ కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ, నటుడు ప్రకాశ్‌రాజ్‌ మీద సిద్ధు సినిమాకు సంబంధించి జ్యోతి ప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదును నిర్మాతల మండలి మా దృష్టికి గతంలో తీసుకొచ్చింది. అప్పుడు సర్వసభ్యసమావేశంలో ప్రకాశ్‌రాజ్‌పై చర్యతీసుకునే అంశాన్ని కార్యవర్గ సభ్యులకు అప్పజెపుతూ తీర్మానం చేశాం. ఆ తర్వాత జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు కొందరు నిర్మాతలు మా సభ్యులకు పారితోషికం బకాయి ఉన్నారు. ఆయా నిర్మాతల మీద నిర్మాతల మండలి చర్య తీసుకున్న తర్వాత ప్రకాశ్‌రాజ్‌పై మా చర్యతీసుకోవడం సబబుగా ఉంటుందని కార్యవర్గం అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని మండలికి కూడా తెలియచేశాం. సామరస్యపూర్వకంగా పరిష్కారించుకోవలసిన సమస్యలను మీడియా దృష్టికి తీసుకెళ్ళడం మాకెంతో బాధను కలిగిస్తోంది. ఈ చర్యను ఖండిస్తున్నాం అన్నారు.

    మోహన్‌బాబు కల్పించుకుని మాదంతా ఓ కుటుంబం. అన్నదమ్ముల్లాంటి మా మధ్య ఏర్పడిన అంతర్గత సమస్యల్ని మాకుగా మేం పరిష్కరించుకోవాలే కానీ పత్రికలకు ఎక్కడం సమంజసం కాదు. ఇది మాకు అవమానంగా ఫీలవుతున్నాం అని అన్నారు. మా అధ్యక్షునిగా రెండేళ్ల కాలపరిమితి దిగ్విజయంగా పూర్తి చేశానంటూ మోహన్‌బాబు తన విజయాలను వివరించారు.

    రెండేళ్ళ క్రితం మా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యాను. ఈ రెండేళ్ళ కాలంలో నటీనటులందరి సహకారంతో ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాం. స్టార్‌ క్రికెట్‌ను నిర్వహించి తద్వారా వచ్చిన మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాం. అలానే పైరసీని అదుపు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశాం. ఆయనా సానుకూలంగా స్పందించి, చర్యలు తీసుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న నటీనటులకు సహాయం అందించాం. ఇన్సూరెన్స్‌ విషయంలోనూ సభ్యులకు ఉపయోగపడే చర్యలు తీసుకున్నాం. అక్టోబర్‌ ఎనిమిదిన కొత్త కార్యవర్గానికి ఎన్నికలు జరుగబోతున్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల నేనీసారి ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదు. ఈ రెండేళ్ళ కాలంలో ఓ కుటుంబ సభ్యుల్లా ఐకమత్యంతో మెలగి మాకు ఎన్నడూ లేనంత గుర్తింపును తీసుకురాగలిగాం అని మోహన్‌బాబు చెప్పుకొచ్చారు.

    వృద్ధ సినీ కళాకారుల కోసం విజయచందర్‌ రెండు ఎకరాల స్థలాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డారని, ఆయన్ని మా తరఫున అభినందిస్తున్నామని మోహన్‌బాబు తెలిపారు. ఈ సమావేశంలో మల్లికార్జునరావు, శ్రీహరి, ఎస్వీ కృష్ణారెడ్డి, గిరిబాబు, విజయ్‌చందర్‌, ఆలీ, ఆహుతి ప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, ఓ.కళ్యాణ్‌, జీవిత పాల్గొన్నారు.

    మరిన్నికథనాలు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X