Cinema Buzz: రేపు విడుదలయ్యే సినిమాల విశేషాలు
హైదరాబాద్: వీకెండ్ వచ్చిదంటే చాలు ఏదో ఒక సినిమా విడుదలకు సిద్దంగా ఉంటుంది. వారాంతం కావడంతో ఓపెనింగ్స్ బాగా వస్తాయనే ఉద్దేశ్యంతో చాలా మంది నిర్మాతలు శుక్రవారం సినిమాను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ శుక్రవారం(డిసెంబర్ 21) కూడా పలు సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. అందులో రవితేజ-కాజల్ జంటగా రూపొందిన 'సారొచ్చారు', విశాల్-త్రిష జంటగా రూపొందిన 'వేటాడు-వెంటాడు', సల్మాన్ ఖాన్ బాలీవుడ్ మూవీ 'దబాంగ్ 2', తమిళనటుడు ప్రభు తనయుడి తొలి చిత్రం 'గజరాజు', 'మిథునం' చిత్రాలు ఉన్నాయి.
1. సారొచ్చారు
పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని వైజయంతిమూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేసారు. డిసెంబర్ 21న ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
2. వెంటాడు-వేటాడు
విశాల్ హీరోగా 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై నిర్మాత శ్రీనివాస్ దామెర అందిస్తున్న ద్విభాషా చిత్రం 'వేటాడు - వెంటాడు'. త్రిష కథానాయికగా నటిస్తోంది. డిసెంబర్ 21న చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ మూవీగా తెక్కించారు.
3. దబాంగ్ 2
సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా రూపొందిన చిత్రం 'దబాంగ్ 2'. గతంలో వచ్చిన దబాంగ్ చిత్రం భారీ విజయం సాధించడంతో దానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ దర్శకత్వం వహించారు. నిర్మాత కూడా ఆయనే. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రేపు విడుదల కానుంది.
4. గజరాజు
తమిళ నటుడు ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు తెలుగు తెరకు 'గజరాజు' చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నాడు. తమిళంలో విక్రమ్ ప్రభు, లక్ష్మీ మీనన్ జంటగా నటించిన 'కుమ్కి' చిత్రం తెలుగులో 'గజరాజు' పేరుతో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ విడుదల చేస్తున్నారు. మైనా(ప్రేమ ఖైదీ) ఫేం ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళంలో ఎన్.లింగుస్వామి, చంద్రబోస్‌లు నిర్మించగా బెల్లంకొండ సురేష్ అనువాద హక్కులు పొందారు. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదలవుతోంది.
5. మిథునం
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'మిథునం'. తనికెళ్ల భరణి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని ఏఎమ్మార్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆనంద్ ముయిదరావు, ముయిద శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. బిడ్డ కడుపులో పడ్డప్పట్నుంచి ప్రసవం జరిగేవరకు ఎన్నో ఊహల్లో, కలల్లో తేలిపోయే తల్లిదండ్రులు, ఆ తర్వాత ఆ బిడ్డకు బుడి బుడి అడుగులు, చదువు, సంస్కారం నేర్పడం నుంచి జీవితంలో స్థిరపడేవరకు అలసిపోకుండా ఆనందంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. రెక్కలొచ్చిన బిడ్డ ఏ విదేశాల్లోనే సెటిలైతే.. శేష జీవితాన్ని వృద్ధ దంపతులు ఎలా గడుపుతారు? కొంతమందైతే బిడ్డల ఆగమనం కోసం ఎదురు చూస్తూ దాదాపు నిరాశా నిస్పృహల్లో బతుకుతారు. కానీ 'ఒక జంట' అందుకు భిన్నంగా రమణీయంగా, రసమయంగా తమ శేష జీవితాన్ని ఎంతో మధురంగా గడుపుతారు. ఆ విశేషాలను చేపే సినిమా 'మిథునం'.


Click it and Unblock the Notifications











