కామనే...: శ్రీను వైట్ల-ప్రకాష్ రాజ్ వివాదంపై ‘మా’
హైదరాబాద్: ప్రకాశ్‌రాజ్ శ్రీను వైట్ల వివాదంలో కో ఆర్డినేషన్ కమిటీ జోక్యం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు మురళీమోహన్ తెలిపారు. రాజమండ్రిలోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అభిప్రాయభేదాలు సహజమేనని, సినిమా రంగం రెండు గ్రూపులుగా విడిపోయింద నడం నిజం కాదని వివరించారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ గ్రూపులుగా చీలిపోయారని ప్రచారం చేశారని, తర్వాత మరో గ్రూపు అన్నారని ఆయన పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్యే అభిప్రాయభేదాలు వస్తుంటాయని, సినీ పరిశ్రమలో ఆర్టిస్టుల మధ్యగానీ, నిర్మాతల మధ్యగానీ విభేదాలు ఏర్పడినప్పుడు, వాటిని పరిష్కరించడానికి కోఆర్డినేషన్ కమిటీ ఉంటుందన్నారు. ప్రకాశ్‌రాజ్ మంచి కళాకారుడని, ఆయన ఇష్యూ పరిష్కారం అవుతుందని మురళీమోహన్ చెప్పారు.

ముదిరిన వివాదం...
దర్శకుడు శ్రీను వైట్ల, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య ఉన్న విబేధాలు రచ్చకెక్కాయి. ఆగడు సినిమా సమయంలో ప్రకాష్ రాజ్, శ్రీను వైట్ల మధ్య విబేధాలు పొడ చూపిన సంగతి తెలిసిందే. దీంతో ప్రకాష్ రాజ్ ను సినిమా నుండి తప్పించాడు శ్రీను వైట్ల. అప్పట్లో ఇదో సంచలనం. ‘ఆగడు' సెట్లో జరిగిన గొడవ కారణంగా ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పే పరిస్థితి వచ్చింది.
అప్పటి నుండి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా ప్రకాష్ రాజ్.....శ్రీను వైట్ల పై మండి పడ్డారు. తన ఆవేదనను పద్య రూపంలో చెబితే తన అనుమతి లేకుండా శ్రీను వైట్ల తన సినిమాలో వాడుకున్నారని, ఏ మాత్రం సిగ్గున్నా తన అనుమతి తీసుకుని ఉండాల్సిందని ప్రకాష్ రాజ్ ధ్వజమెత్తారు.
కక్ష్యతో కాదు...కసితో పని చేయాలని శ్రీను వైట్లకు సూచించారు ప్రకాష్ రాజ్. ఇంతటితో ఆగని ప్రకాష్ రాజ్ ఇటీవల శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఆగడు' సినిమా విషయాన్ని కూడా ప్రస్తావించారు. డబ్బులు పెట్టే నిర్మాతలున్నా మహేష్ బాబు అభిమానులు మెచ్చే విధంగా శ్రీను వైట్ల సినిమా తీయలేక పోయారని విమర్శించారు.


Click it and Unblock the Notifications











