సంగీత దర్శకుడు చక్రధర్ ఇక లేరు
'మగమహారాజు', 'చట్టానికి కళ్లు లేవు' వంటి చిత్రాలకు హిట్ సంగీతం అందించిన సంగీత దర్శకుడు చక్రధర్(72) శనివారం కన్ను మూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ మృతి చెందారు.ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు ప్రథమ శిష్యునిగా గుర్తింపు పొందిన చక్రధర్ మరో ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద సుమారు 950 సినిమాల వరకు అసిస్టెంట్ గా పని చేశారు. ఆ తర్వాత వివిధ భాషలకు చెందిన 50 చిత్రాల వరకు సంగీత దర్శకుడు కృష్ణతో కలిసి సంగీత సారథ్యం వహించారు. 'కృష్ణ-చక్ర'గా వీరిరువురూ ప్రసిద్ధులు. 'మగమహారాజు', 'చట్టానికి కళ్లు లేవు', 'ఏమండీ శ్రీమతి గారూ', 'నేటి చరిత్ర', 'రేపటి కొడుకు', 'సగటు మనిషి', 'ఆడవాళ్లే అలిగితే', 'ప్రతిస్పందన', 'సమాజంలో స్త్రీ', 'ఆగ్రహం' వంటి చిత్రాలకు చక్రధర్ సంగీతం అందించారు. ఇక ఆయనకు భార్య సతీష, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె వున్నారు. చక్రధర్ భౌతికకాయాన్ని ప్రముఖ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకులు కోటి, సాలూరి వాసూరావు, స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణుడు ఏకనాథ్ తదితరులు దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆదివారం చక్రధర్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగాయి. దట్స్ తెలుగు ఈయన మృతికి శ్రధ్దాంజలి ఘటిస్తోంది.


Click it and Unblock the Notifications











