నేస్తమా...! ఎదురుచూస్తుంటా త్వరగా వచ్చేయ్- ఇళయరాజా
ఒకరు స్వర మాంత్రికుడు, మరొకరు గానగాంధర్వుడు, ఒకరి తాళం కోసమే మరొకరి స్వరం పుట్టిందా అనేంతగా ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆ స్నేహమాధుర్యం శ్రోతల చెవులకు అమృతాన్ని అందించాయి. జనరంజకమైన పాటలెన్నో ఇప్పటికీ ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉన్నాయి. వారే ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.
ఎస్పీ బాలసుబ్రహ్మణం కోవిడ్ 19 బారిన పడి ఆసుపత్రిపాలైన క్షణం ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులు ధిగ్భ్రాంతికి గురయ్యారనే చెప్పాలి. వేవేల ప్రార్ధనల నడుమ ఎస్పీబీ క్రమంగా కోలుకుంటుండగా, ఆయన ఆప్తమిత్రుడు అయిన స్వరమాంత్రికుడు ఇళయరాజా పంపిన హృదయపూర్వక సందేశం బాల సుబ్రహ్మణ్యానికే కాదు, యావత్ భారత్ హృదయాన్ని కదిలిస్తోంది.

ఓ వీడియో సందేశం ద్వారా ప్రియతమ మిత్రుడు బాల సబ్రహ్మణ్యానికి సందేశం పంపిన ఇళయరాజా తన నేస్తాన్ని ఆప్యాయంగా బాబు అని సంబోధిస్తూ మాట్లాడారు. "బాలు త్వరగా వచ్చేసేయ్.. నేను నీ కోసం ఎదురుచూస్తున్నాను. మన స్నేహం సినిమాలకు మాత్రమే పరిమితం కాదు. అది ఇక్కడితో అంతమైపోదు. సంగీతమే మన జీవిత పరమావిధి, అదే మన ప్రాణం" అని వ్యాఖ్యానించారు.
ఓ నిమిషం నిడివి ఉన్న వీడియోలో తన నేస్తం గురించి, సంగీతం గురించి మాట్లాడిన ఇళయరాజా, గతేడాది తమ మధ్య తలెత్తిన పొరపొచ్చాల గురించి కూడా ప్రస్తావించడం మరో విశేషం. "సంగీతం, స్వరాలు ఎలా ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయో, మన జీవితాలు, స్నేహం కూడా అంతే, ఎవరూ విడదీయలేరు. మనం కలసిమెలసి ఉన్నా, ఒకరితో మరొకరు గొడవ పడినా, మన హృదయాలకు తెలుసు ఏం జరిగినా అది మన స్నేహం - ప్రేమ లోంచి పుట్టినదే అని.నా అంతరాత్మ చెబుతోంది.
నువ్వు త్వరగా కోలుకుంటావని, దేవుడిని ప్రార్ధిస్తున్నా నువ్వు త్వరగా కోలుకోవాలని. బాలు, త్వరగా వచ్చేయ్" అని ఇళయరాజా వీడియోలో తన ప్రియ నేస్తం గురించి స్పందించారు.
ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలసుబ్రహ్మణ్యం, వెంటిలేటర్ పై ఉన్నారని తెలుస్తోంది. అయితే ఆయన తనయుడు ఎస్పీ చరణ్, ప్రస్తుతాని బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











