'రేస్-2' చిత్రం పై వివాదం..ముస్లింల ఆగ్రహం
తుమకూరు : విశ్వరూపం చిత్రంపై పలు వివాదాలు రేగి, కోర్టు తీర్పుతో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మరో చిత్రం ముస్లింల నుంచి వివాదం ఎదుర్కొంటోంది. రీసెంట్ గా విడుదలైన రేస్-2 సినిమా పోస్టర్‌లో ముస్లిం పవిత్ర గ్రంథమైన ఖురాన్ వ్యాఖ్యలు ముద్రించి ఖురాన్‌ను అపవిత్రం చేశారని చిత్రాన్ని నిలిపి వేయాలని ఆరోపిస్తూ జిల్లా ఎస్పీ రమణగుప్తాకు జిల్లాలోని ముస్లింలు వినతిపత్రం సమర్పించారు.
నగరంలో రేస్-2 పోస్టర్లను తొలగించాలని పేర్కొన్నారు. పవిత్ర ఖురాన్ వ్యాఖ్యలను గోడలకు అంటించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విన్నవించారు. టిప్స్ మ్యూజిక్ ఫిలిమ్స్ పతాకాన రూపొందించిన ఈ చిత్రానికి రచన షిరాజ్ అహమ్మద్, సంగీతం ప్రీతమ్, నేపథ్య సంగీతం సలీమా సులైమాన్, ఛాయాగ్రహణం రవి యాదవ్, కూర్పు హుశ్శేన్ బర్మావాలా నిర్వహించారు. 87 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రమేష్ ఎస్. టౌరాని, రోన్నీ స్క్రూవాలా, సిద్దార్థ రాయ్ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీ, ఊర్దూ, ఇంగ్లీషు భాషల్లో జనవరి 25న విడుదల అయింది.
చిత్రంలోని కథ విషయానికి వస్తే రణ్‌వీర్ సింగ్ (సైఫ్ ఆలీఖాన్) తన ప్రియురాలు సోనియా మరణానికి కారకులైన వారిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలో టర్కీలో మాఫియా లీడర్ ఆర్మాన్ మాలిక్ (జాన్ అబ్రహాం) అతని ప్రేయసి అయేషా (జాక్విలిన్ ఫెర్నాండెజ్), భాగస్వామి ఎరీనా (దీపికా పదుకొణ) తటస్థపడతారు రణ్‌వీర్‌కి. అర్మాన్ తన బృందంతో చాలా నేరాలు చేస్తుంటాడు తన లక్ష్యం నెరవేర్చుకోడానికి. టర్కీలోకి రణ్‌వీర్‌సింగ్ ప్రవేశించాక సినిమాలో ఊహించని మలుపులు ఏర్పడుతాయి. రాబర్డ్ డి కోస్టాగా అనిల్ కపూర్, చెర్రీగా అమీషా పటేల్, విక్రమ్ థాపర్‌గా రాజేష్ ఖత్తార్ మిగతా కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











