‘‘తనుశ్రీపై జరిగిన దారుణం మా కుటుంబం ఎప్పటికీ మరిచిపోలేదు’’
తనుశ్రీ దత్తాపై పదేళ్ల క్రితం 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా సమయంలో జరిగిన దారుణ సంఘటన మా కుటుంబం ఎప్పటికీ మరిచిపోలేదు. ఈ సంఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నా మాకు ఇప్పటికీ న్యాయం జరుగలేదు అన్నారు వత్సల్ సేఠ్. 90ల్లో వెండితెరపై మెరిసిన వత్సల్ సేఠ్... అప్పట్లో జస్ట్ మొహబ్బత్ లాంటి టెలివిజన్ సిరీస్‌లలో కూడా నటించారు. ఇతడు మరెవరో కాదు తనుశ్రీకి బావ. తనుశ్రీ సోదరి ఇషితా దత్తాను అతడు పెళ్లాడారు.
ఇటీవల ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో వత్సల్ సేఠ్ మాట్లాడుతూ 2008లో జరిగిన ఆ భయానక సంఘటనకు సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ తమను వెంటాడుతూనే ఉన్నాయని తెలిపారు.

తనుశ్రీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి
తనుశ్రీ దత్తా ధైర్యంగా ముందుకు వచ్చి ఆ సంఘటన గురించి మాట్లాడింది. ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. దాని గురించి ఇటీవలే నా భార్య ఇషితా చెప్పే వరకు తెలియదు. కారులో వెళుతుండగా నడి రోడ్డు మీద పోలీసుల ముందే దాడి చేశారు.... అని వత్సల్ సేఠ్ ఆంగ్లమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఫ్యామిలీ మొత్తం భయం భయంగా
ఆనాడు జరిగిన సంఘటన తర్వాత కొన్నేళ్ల పాటు మా ఫ్యామిలీ మొత్తం భయం భయంగా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ వారు ఆ సంఘన గుర్తు చేసుకుని భాధ పడుతూ ఉంటారని వత్సల్ సేఠ్ వ్యాఖ్యానించారు.

అందరి మద్దతు లభించడం సంతోషంగా ఉంది
ఇన్నేళ్ల తర్వాత తనుశ్రీ దత్తా ధైర్యంగా ముందుకు వచ్చి మీటూ ఉద్యమంలో భాగంగా తాను ఎదుర్కొన్న సంఘటన గురించి వెల్లడించడం, దానికి బాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీల నుంచి మద్దతు లభించడం సంతోషంగా ఉంది అని వత్సల్ సేట్ తెలిపారు.

మీటూ ఉద్యమం
నానా పాటేకర్ మీద తనుశ్రీ దత్తా ఆరోపణల తర్వాతే ‘మీటూ' ఉద్యమం బాలీవుడ్లో ఉధృతమైన సంగతి తెలిసిందే. తనుశ్రీ ఇచ్చిన దైర్యంతో పలువురు నటీమణులు, సింగర్స్ ముందుకు వచ్చి బాలీవుడ్లో ఉన్న కామాంధుల భాగోతాలు బయటపెడుతున్నారు.


Click it and Unblock the Notifications











