మరీ అలా అడగొద్దు, కుటుంబ సభ్యుల్లో వారు మాత్రమే: ‘ఎన్టీఆర్’పై బాలకృష్ణ
తెలుగు సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్. మహా నటుడిగా, మానవతామూర్తిగా, తెలుగు జాతి గొప్పదనం ప్రపంచానికి చాటిన మహనీయుడిగా, ప్రజలను ఎంతో గొప్పగా పాలించిన ముఖ్యమంత్రిగా ఇలా తాను అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ తన ప్రత్యేకత చాటిన వ్యక్తి జీవితంలో ప్రపంచానికి తెలియని ఎన్నో కోణాలు దాగి ఉన్నాయి. ఈ బయోపిక్ ద్వారా ఎన్టీ రామారావు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ఆయన కుమారుడు బాలకృష్ణ పోషిస్తుండటం మరో విశేషం.

ఎన్టీఆర్ స్వగ్రామంలో షూటింగ్
ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో కూడా ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన సీన్లు చిత్రీకరించబోతున్నారు. ఇందులో భాగంగా బాలయ్య, దర్శకుడు క్రిష్ ఇటీవల నిర్మకూరు వచ్చి అక్కడ పర్యటించారు. అక్టోబర్, నవంబర్లో ఇక్కడ షూటింగ్ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ పలు విషయాలు చెప్పుకొచ్చారు.

ఇది ఏ పార్టీకి సంబంధించిన సినిమా కాదు
‘ఎన్టీఆర్' సినిమా ఏ పార్టీకి సంబంధించినది కాదు, ఏ ఒక్క వర్గానికి చెందినది కాదు. ఇది అందరి సినిమా. ఇందులో ఎన్టీఆర్ జీవితంలో ఉన్న అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు ఉంటారు అని బాలయ్య తెలిపారు.

కుటుంబ సభ్యులు ఉంటారు కానీ..
సినిమాలో కుటుంబ సభ్యుల పాత్రలు కూడా ఉంటారు కానీ అందరూ కాదు.... కొందరి గురించి మాత్రమే సినిమాలో చూపిస్తాం. అయితే వారు రియల్‌గా తెరపై కనిపిస్తారా? లేక వారి పాత్రల్లో ఇతరులెవరైనా కనిపిస్తారా? అనేది తెరపై చూడాల్సందే అన్నారు బాలయ్య.

తీగ లాగితే డొంకంతా... అలా అడగొద్దు
సినిమాలో బాలకృష్ణ పాత్రను ఎవరు పోషిస్తున్నారు? అనే ప్రశ్నకు బాలయ్య ఆసక్తికరంగా స్పందించారు. తీగ లాగితే డొంకంతా కదిలించ వచ్చు అన్నట్లు మీరు అడుగుతున్నారు. మరీ అలా అడగొద్దు. నా పాత్రలో ఎవరు నటిస్తారు? అనేది తెరపై చూడండి అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ గురించి మనకు తెలిసింది ఒక శాతమే: క్రిష్
ఆయన కథ చెబుతున్నాం కాబట్టి కొన్ని నెలల నుండి ఎన్టీఆర్ గారి ఊహల్లో బ్రతుకుతున్నాం. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. అందరూ అనుకుంటాం ఎన్టీఆర్ గారి కథ మనందరికీ తెలిసిన కథే అని, కానీ మనకు తెలిసింది ఒక శాతం మాత్రమే. 99 శాతం బయటి ప్రపంచానికి తెలియని విషయాలు ఉన్నాయి. ఆయన గురించి పరిశోధిస్తున్న కొద్దీ కొత్త విషయాలు తెలుస్తున్నాయని క్రిష్ తెలిపారు.

మూడు గంటల్లో తీయడం కష్టం
ఎన్టీఆర్ గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నింటినీ క్రోడీకరించి మూడు గంటల్లోనో, మూడున్నర గంటల్లోనో తెరపై చెప్పడం అసాధ్యం. అందుకోసం చాలా కష్టపడాల్సి వస్తోంది. అయితే సినిమా ఎన్ని భాగాలు ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం అన్నారు.

అపుడు తల్లిరుణం, ఇపుడు తండ్రి రుణం
తెలుగు జాతి గొప్పదనం చాటిన వ్యక్తి రామారావుగారు. ఆలాంటి వ్యక్తికథ చెప్పే భాగ్యం నాకు దక్కడం ఆనందంగా ఉంది. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా ద్వారా తన పేరును బవరామ తారకపుత్రగా మార్చుకుని బాలయ్య తన తల్లిరుణం కొంత తీర్చుకున్నారు. ఈ సినిమా ద్వారా తండ్రి రుణం తీర్చుకుంటున్నారు. ఈ మహాయజ్ఞంలో నేనూ భాగం కావడం ఆనందంగా ఉంది... అని బాలయ్య తెలిపారు.


Click it and Unblock the Notifications











