నాది గెస్ట్ రోల్ కాదు: బాలకృష్ణ
హైదరాబాద్: 'ఊ కొడతారా..' లో నాది గెస్ట్ రోల్ కాదు. కథకు కీలకమైన పాత్ర. ఇందులో మనోజ్ ఒక 'ఇన్‌స్ట్రుమెంట్'. అంటే ఏంటో రేపు ఈ సినిమా చూశాక మీకర్థమవుతుంది' అంటున్నారు బాలకృష్ణ. మనోజ్ హీరోగా నటించిన 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'లో నందమూరి బాలకృష్ణ ఓ ప్రత్యేకమైన పాత్ర చేయడం సినిమా ప్రారంభం నుంచి అంతటా చర్చనీయాంశమైంది. దీనికి సమాధానం ఈ నెల 27న వెండితెర మీద లభిస్తుందని బాలకృష్ణ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అలాగే ... "ఈ కథ నా పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ సందర్భంగా నాన్నగారు చేసిన 'మేలు కొలుపు' సినిమా గురించి చెప్పాలి. ఆ చిత్రంలో ఆయన చేసింది గెస్ట్ రోల్. అయితే పోస్టర్లలో మొత్తం నాన్నగారి ఫొటోలే ముద్రించారు. దాంతో ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఆ సినిమాకి వెళ్లారు. కానీ సినిమాలో జస్ట్ గెస్ట్ రోల్‌లో కనిపించడంవల్ల నిరాశపడ్డారు. ఫలితంగా సినిమా ఫ్లాప్ అయ్యింది. అందుకని ప్రేక్షకులకు ఎప్పుడూ ఉన్నదున్నట్లు చెప్పాలి" అని అన్నారు.
"ఇందులో నేను చేసినది వైవిధ్యభరితమైన పాత్ర. ఈ కథ, పాత్ర నచ్చడంవల్ల చేశాను. ఈ రోల్‌ని ఎంజాయ్ చేస్తూ చేశాను. మామూలుగా నేను ఒక పాత్రను సొంతం చేసుకున్న తర్వాత, అందులోకి పూర్తిగా ఒదిగిపోతాను. ఈ చిత్రంలోని పాత్రలో కూడా అలాగే మౌల్డ్ అయ్యాను. ఇది మంచి పాత్ర కాబట్టి నటుడిగా పూర్తి సంతృప్తి లభించిందని మాత్రం చెప్పను. ఎన్ని వందల పాత్రలు చేసినా కళాకారులకు సంతృప్తి అనేది లభించదు" అని అన్నారు.
"ఇక ఈ సినిమా గురించి విన్న తర్వాత అభిమానులు ఊ... అనే విధంగా స్పందించారు. ఇందులో నటించడం అంత అవసరమా? అని కూడా అనుకున్నారు. ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. కాబట్టి సినిమా చూసేటప్పుడు ముందు ఉలిక్కిపడి ఆ తర్వాత బలంగా ఊ అంటారు. అభిమానులే కాదు, ప్రేక్షకులందరికీ నచ్చుతుంది" అని హామీ ఇచ్చారు.
బాలకృష్ణ, ప్రభు, మనోజ్, దీక్షాసేథ్, లక్ష్మీ ప్రసన్న, సోనూసూద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రానికి సంగీతం బెబో శశి.


Click it and Unblock the Notifications











