‘నా బంగారు తల్లి’కి మూడు జాతీయ అవార్డులు
హైదరాబాద్: రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా బంగారు తల్లి' జాతీ అవార్డుల రేసులో తెలుగు సినిమా సత్తాను చాటింది. 2013 సంవత్సరానికిగాను జరిగిన జాతీయ అవార్డుల రేసులో ఏకంగా మూడు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో అవార్డులు సొంతం చేసుకుంది. దీంతో పాటు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన అంజలి పాటిల్ స్పెషల్ జ్యూరీ అవార్డు చేజిక్కించుకున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజేష్ టచ్ రివర్ మాట్లాడుతూ...'జాతీయ స్థాయిలో అవార్డు రావడం ఆనందంగా ఉంది. గతంలో ఇండోనేషియాలో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ, బెస్డ్ సినిమా ఆఫ్ ఫెస్టివల్, ట్రినిడి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డుతో పాటు అనే అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమాకు గుర్తింపు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నప్పటికీ ఇక్కడ సరైన గుర్తింపు రాలేదనే వెలితి ఉండేది. కానీ తాజాగా దక్కిన జాతీయ అవార్డుతో ఆ వెలితి తీరి పోయింది. ఈ ఆనందాన్ని పంచుకుందామనుకున్నప్పటికీ ప్రస్తుతం బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉండటం కారణంగా మీడియాతో ఈ ప్రకటన ద్వారా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను' అన్నారు.

యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధంతో పాటు, నేడు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజెప్పేదిగా ఉంటుందని తెలిపారు. సిద్ధిక్, అంజలి పాటిల్, నైనా కృపా తదితరులు నటించిన ఈ చిత్రానికి శాంతను మోయిత్రా సంగీతం అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రామ తులసి, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్, ఎడిటింగ్: డాన్ మాక్స్.


Click it and Unblock the Notifications











