ప్రతి తండ్రి చూడాల్సిన సినిమా ఇది: చిరంజీవి
హైదరాబాద్: అంజలి పాటిల్, సిద్ధిఖి,లక్ష్మీమీనన్, రత్నశేఖర్ ప్రధాన పాత్రల్లో రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా బంగారు తల్లి'. ప్రజ్వల సంస్థ సమర్పణలో సునీత కృష్ణన్, ఎం.ఎస్.రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శంతన్ మొయిత్రా సంగీతం అందించారు. ఈచిత్రం ఆడియో వేడుక ఇటీవల హైదరాబాద్ లో జరిగింది.
ఈ ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయి సీడీలు ఆవిష్కరించారు. థియేట్రికల్ ట్రైలర్‌ను త్రిపుర వెంకటరత్నం, సునీల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ వ్యభిచారం అనే ఇతివృత్తాన్ని తీసుకుని రాజేష్ అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రతి తండ్రి చూడాల్సిన చిత్రమిది. నేను స్టాలిన్ చిత్రంలో చెప్పినట్లు సినిమా చూసిన ప్రతి ఒక్కరు మరో ముగ్గురిని, ఆ ముగ్గురు తలో ముగ్గురిని సినిమా చూసే విధంగా చేయాలి అన్నారు.

ఈ చిత్ర నిర్మాత సునీత చేసే కార్యక్రమాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇటువంటి వారికి అవార్డులు ఇవ్వకపోతే మరెందుకు అనిపించింది. తోటి మహిళలకు బాసటగా నిలవడం ఆమె గొప్పదనం. ప్రభుత్వం వారు ఆమెకు ఎలాంటి సహకారాన్ని అందించకపోయినా చక్కటి కమిట్‌మెంట్‌తో ఆమె ముందుకెళుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆమెకు సహకరించాల్సిన అవసరం ఎంతో వుంది. ప్రతి ఒక్కరినీ ఎడ్యుకేట్ చేసే చిత్రాన్ని ఆమె నిర్మించారని తెలిపారు.
సునీత కృష్ణన్ మాట్లాడుతూ ఈ చిత్ర కథ నన్ను ఎంతగానో కదిలించింది. సినిమానే పూర్తి చేయడానికి ఇల్లుతో సహా అన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈచిత్రం ప్రదర్శితం అయింది. కానీ ఇప్పటి వరకు రిలీజ్ మాత్రం చేయలేక పోయాము. అప్పుడే దేవుడి దూతల్లా అల్లు అరవింద్, అమల వచ్చి నాకు సహకరించారు. ఈ నెల 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు.


Click it and Unblock the Notifications