శేఖర్, చందూ యేలేటికి నాగ్ ఛాన్స్
ప్రతిభావంతులైన దర్శకులను ముందే వెతికిపట్టుకుని అవకాశాలు ఇవ్వడంలో నాగ్ నిజమైన ట్రెండ్ సెట్టర్ అని రామ్‌గోపాల్ వర్మ అంతటివాడు పూర్తి క్రెడిట్ నాగార్జునకిచ్చారు - ఈ మధ్య శివ 2006 ఫంక్షన్‌లో. మొదటి నుంచి కొత్త దర్శకులతో పనిచేయడానికి నాగార్జున ఎప్పుడూ వెనుకాడలేదు. ప్రయోగాలు చేయడంలోనూ ఆయన అందరికంటే ముందే ఉన్నారు. శివ వంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చాక మళ్లీ అదే ఫార్ములా బాట పట్టకుండా, గీతాంజలి సబ్జెక్టు ఓకె చేసి మణిరత్నం చిత్రంలో నటించారు. నిన్నే పెళ్లడతా వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ద్వారా సూపర్ హిట్ సాధించి, తర్వాత అన్నమయ్య చిత్రాన్ని చేసే సాహసం చేశారు నాగార్జున. దర్శకుడి ప్రతిభను పసిగట్టి, ఆ దర్శకుడి ముందు చిత్రాలు హిట్టా, ఫట్టా అనే సినిమా కాలిక్యులేషన్స్ పట్టించుకోకుండా తనతో పనిచేసే అవకాశాలు ఇచ్చే సాహసం కేవలం నాగార్జున మాత్రమే చేస్తూ వచ్చారు.
ఆ కోవలోనే ఇటీవల ఆనంద్, గోదావరి చిత్రాల ద్వారా మంచి చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన శేఖర్ కమ్ములను తన కోసం ఒక కథ రెడీ చేసుకోవాల్సిందిగా నాగార్జున చెప్పారు. ఇదే విషయం చెబుతూ - శేఖర్ కమ్ముల ఆనంద్, గోదావరి చిత్రాలు చూశాను. ఆనంద్ చాలా బాగా నచ్చింది. గోదావరి చూస్తున్నప్పుడు చాలా ప్లెజెంట్‌గా ఫీలయ్యాను. గీతాంజలి సినిమా గుర్తుకొచ్చింది. అందుకే శేఖర్‌ని సబ్జెక్ట్ రెడీ చేసుకోమని చెప్పానన్నారు నాగార్జున.
అలాగే, కేవలం రెండే చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో జీనియస్ దర్శకుడిగా ఎదిగిన చంద్రశేఖర్ యేలేటికి కూడా నాగార్జున ప్రామిస్ చేశారు. తన కోసం ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకోవాల్సిందిగా ఆయన నిర్మాత గుణ్ణం గంగరాజునూ, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిని అడిగారు. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఐతే.., అనుకోకుండా ఒక రోజు చిత్రాలు ఎంతగా ప్రేక్షకులను అలరించాయో అందరికీ తెలిసిందే.


Click it and Unblock the Notifications