బొకేలు, ఆయుధాలు తేవద్దు: నాగబాబు
బొకేలు, ఆయుధాలతో ఎవరూ రిసెప్షన్ లోనికి రావద్దని మెగా సోదరుడు నాగబాబు సూచించారు. వీఐపీల గన్‌మెన్‌లను సైతం లోనికి అనుమతించరని ఆయన స్పష్టం చేశారు. భద్రతారీత్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని నాగబాబు తెలిపారు. వివాహానంతరం ఆయన మీడియాతో సాయింత్రం జరగనున్న రిసెప్షన్ కు సంభందించి ఇలా ప్రకటన చేసారు.
అలాగే... రామ్ చరణ్, ఉపాసన వివాహం కన్నులపండువగా జరిగిందని చిరంజీవి సోదరుడు నాగబాబు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆద్యంతం ఆనందంగా ఈ వేడుక జరిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే మ్యారేజ్ రిసెప్షన్‌కు సంబంధించి ఆహుతులకు సూచనలను చేశారు. బార్ కోడ్ ను అనుసరించి రిసెప్షన్ కు ఇద్దరు వ్యక్తుల కన్నా అనుమతి లేదన్నారు.
ఈ రోజు (గురువారం)సాయంత్రం హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో రామ్ చరణ్ పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు ఆరు వేల మందికి ఆహ్వానాలు అందజేశారు. ఆయా కార్యక్రమాలకు ఆహ్వానించిన వారికి మించి ఇతరులు రాకుండా ఆహ్వానపత్రికలోనే ఒక స్వైప్ కార్డు పంపిణీ చేశారు. ఆ కార్డులున్న వారికి మాత్రమే లోపలికి ప్రవేశం ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. ప్రముఖ సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కొణిదెల చిరంజీవి కుమారుడు హీరో రాంచరణ్ తేజ, ప్రముఖ వ్యాపారవేత్త అపోలో ప్రతాప్‌రెడ్డి మనుమరాలు కామినేని ఉపాసనల పెళ్లి గురువారం ఉదయం హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్ లో ఘనంగా జరిగింది.
ఇక ఈ పెళ్లి సందర్భంగా చిరంజీవి కుటుంబ సినీ అభిమానులకు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాగబాబు ఈ విందు విషయమై మాట్లాడుతూ.. పెళ్లి జరిగే ఫామ్ హౌస్‌లోనే ఈ నెల 15వ తేదీన అభిమానుల కోసం ప్రత్యేకవిందు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఈ విందుకు అందుబాటులో ఉన్న ఐదువేలమంది అభిమానులకు ఆహ్వానపత్రికలు అందచేశామని, ఆహ్వానాలు ఉన్నవారే ఆ కార్యక్రమానికి రావాలని కోరారు. దూరప్రాంతాల నుంచి వచ్చే అభిమానులను ఫామ్‌హౌస్‌కు చేర్చేందుకు వివిధ ప్రాంతాల్లో బస్సులు ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. భద్రాచలం, తిరుపతి నుంచి వచ్చిన పలువురు అభిమానులు ముత్యాల తలంబ్రాలు, పెళ్లి బట్టలు తీసుకువచ్చి నాగేంద్రబాబుకు అందజేశారు.


Click it and Unblock the Notifications











