పెద్ద బ్యానర్లలో నాగచైతన్య
నాగార్జున నటవారసుడుగా 'జోష్' చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగచైతన్య ప్రస్తుతం ఆ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తెలుసుకుంటూ తదుపరి చిత్రాల వైపు దృష్టి సారిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా 'జోష్' చిత్రం తెరకెక్కినప్పటికీ ఇందులో సందేశాల పాళ్లు ఎక్కువయ్యాయనే అభిప్రాయం సినీ ఇండస్ట్రీ లో బలంగా వినిపిస్తోంది. అయితే నటన పరంగా నాగచైతన్యకు మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. తొలిచిత్రం యువదర్శకుడితో చేసినప్పటికీ కెరీర్ పరంగా బలమైన పునాది పడాలంటే అగ్ర దర్శకులు, బ్యానర్ల చేతిలో పడాల్సిన అవసరం నాగచైతన్యకు ఉందనే విషయాన్ని కాదనలేం. దీనిని దృష్టిలో పెట్టుకునే నాగచైతన్య తదుపరి చిత్రాల ప్లానింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగానే చైతన్య ద్వితీయ చిత్రాన్ని పాపులర్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేయబోతున్నారు. మహేష్ సోదరి మంజుల నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకొంది. ఈ చిత్రం తర్వాత నాగచైతన్య మూడు ప్రిస్టేజియస్ బ్యానర్లలో నటించబోతున్నారని తెలుస్తోంది.
నాగచైతన్య మూడో చిత్రం సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మించనుందని తెలుస్తోంది. నాగార్జునకు 'మాస్' వంటి సెన్సేషన్ హిట్ ఇచ్చిన లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. నాలుగో చిత్రం వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించనున్నారు. దీనికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఛాన్స్ డాక్టర్ డి.రామానాయుడిదే. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం ఉండబోతోందనీ, దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారనీ తెలుస్తోంది. ఇవన్నీ ప్రిస్టేజియస్ చిత్రాలే కావడంతో నాగచైతన్య కెరీర్ మరింత వేగం పుంజుకునే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications











