వచ్చే నెలలో నాగచైతన్య రెండు కొత్త చిత్రాలు ప్రారంభం
హైదరాబాద్ : నాగచైతన్య పూర్తిగా బిజీ కానున్నాడు. మనం చిత్రం చేస్తున్న నాగచైతన్య వచ్చే నెల డిసెంబర్ లో రెండు కొత్త చిత్రాలు కమిటవనున్నాడు. 'సింగ్ వర్సెస్ కౌర్' రీమేక్ చిత్రాన్ని కూడా అదే నెలలో నే ప్రారంభిస్తారు. విజయ్‌కుమార్ కొండా దర్శకత్వం వహించనున్న మరో సినిమా కూడా అప్పుడే సెట్స్‌పైకి వెళ్లబోతోంది.
'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు విజయ్‌కుమార్ కొండా. ఆయన నాగచైతన్య హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రం రూపొందబోతోంది. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఎంపిక చేశారు.
దర్శకుడు విజయ్‌కుమార్ కొండా మాట్లాడుతూ... ''ఎనిమిది నెలలపాటు శ్రమించి కథను సిద్ధం చేశాం. 'గుండె జారి గల్లంతయ్యిందే' కంటే రెండింతలు ఎక్కువ వినోదం ఉంటుంది. సినిమా చూశాక బంధువుల పెళ్లికి వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుంది. నాగచైతన్యని తెరపై కొత్త తరహాలో చూపించబోతున్నాం. వచ్చే నెల రెండోవారంలో చిత్రాన్ని ప్రారంభించబోతున్నాము''అన్నారు.
ఇక నాగచైతన్య నటించిన 'ఆటోనగర్ సూర్య' కూడా డిసెంబరులోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.దాదాపు యేడాది పాటు... ఈ సినిమాని ఎవరూ ముందుకు కదల్చలేదు. 'తడాఖా' హిట్ తరవాత ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. మిగిలిన చిత్రీకరణ పూర్తిచేసి ఇప్పుడు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. డిసెంబరు 13 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర పేరు సూర్య. అతను అనాథ. కానీ అనామకుడు మాత్రం కాదు. ఆటోనగర్ అంటే ఆ ఊళ్లో అందరికీ తెలుసు. అయితే ఆ పేరు వినబడగానే అక్కడ సూర్య అనే ఓ యువకుడు ఉంటాడనే విషయం కూడా గుర్తుకు తెచ్చుకొంటారు. అదీ అతను సంపాదించిన పేరు. సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి యువకుడి జీవితానికి ఎవరు అడ్డుగా నిలిచారు? వారికి సూర్య ఎలా సమాధానం చెప్పాడు? అనేది సినిమా మెయిన్ స్టోరీ.
విజయవాడ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దేవకట్ట తనదైన స్టైల్లో తెరకెక్కించినట్లు సమాచారం. కె అచ్చి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో ప్రేమ, వినోదాంశాలు కలగలిపి ఈచిత్రం రూపొందుతోంది. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.


Click it and Unblock the Notifications












