రూ. 100 అప్పు 1000కి చేరింది... 15 కూడా తీర్చలేని స్థితి, నా జీవితం ఏంటో తెలిసింది: నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు తన ఫేస్ బుక్ పేజీ ద్వారా లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. నిర్మాతగా, నటుడిగా తను అంతగా ఎదగక పోవడానికి గల కారణం ఏమిటో వెల్లడించారు.
నేను ఒక యక్సిడెంటల్ యాక్టర్. ప్రొఫెషనల్ యాక్టర్‌ను కాదు. చాలా కాలం పాటు నటనను సీరియస్‌గా తీసుకోలేదు. క్యారెక్టర్లు సరిగా రావడం లేదని కొంతకాలం సిరీయస్‌గా తీసుకున్నాను. అయినా రాలేదు. మనం సీరియస్‍గా తీసుకున్నంత మాత్రాన క్యారెక్టర్లు రావు. అలా అని మనం భ్రవిస్తాం. కొంతకాలం పాటు నా సినిమాలు సక్సెస్ కావడం లేదు, హిట్టయితే వస్తాయని అనుకున్నాను. తర్వాత మంచి క్యారెక్టర్లు వచ్చాయి, హిట్లు పడ్డాయి. అయినా అకాశాలు అనుకున్న స్థాయిలో రాలేదు. దీన్ని బట్టి ఒకటే అర్థమైంది. ఏ క్యారెక్టర్లయినా అవి రావాల్సిన సమయంలో వస్తాయి. మన ఎదురు చూస్తూ కూర్చోవడంలో లాభం లేదని నాగబాబు తెలిపారు.

అలా సక్సెస్‌లోకి అడుగు పెట్టాను
ఈ మధ్య మంచి పాత్రలు చేశాను. ఇపుడు ఎక్కువగా హీరో తండ్రి పాత్రలు, హీరోయిన్ తండ్రి పాత్రలు లాంటివి చేస్తున్నాను. సినిమా కంటే ఎక్కువ ఎక్స్‌ఫోజర్ టీవీ రంగంలో దొరికింది. అపరంజి, శిఖరం, సీతా మహాలక్ష్మి లాంటి సీరియల్స్ చేశాను. అదుర్స్ అని ఇండియా గాట్ టాలెంట్ తరహా షో చేశాను. తర్వాత జబర్దస్త్ చేయడం అది సక్సెస్ అవ్వడం జరిగింది.

వీళ్లు నన్ను కమ్మగొడుతున్నారని భావించా
నేను టీవీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీ నవ్వు బావుంటుందని అంతా అంటుంటే... నేను వీళ్లంతా నన్ను కమ్మగొడుతున్నారు... నన్ను గోల పెట్టడానికి అనుకునే వాడిని. కొన్ని రోజుల తర్వాత వారు చెబుతున్నది నిజమే అని అర్థమైంది. జబర్దస్త్ చూస్తున్నపుడు జెన్యూన్‌గా నవ్వు వస్తే నవ్వుతాను.

ఇతర భాషల నటులను తీసుకోవడంపై
ఇతర భాష ఇండస్ట్రీల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులను తెచ్చుకోవడం, ఇక్కడ ఉన్న వారిని సరిగా వాడుకోక పోవడంపై నాగబాబు స్పందిస్తూ..... ఎందుకు క్యారెక్టర్లు రావడం లేదని అనుకునేవాడినే తప్ప ఎవరినీ పాయింట్ ఔట్ చేయలేదు. వారు నాకు ఇవ్వకుండా ఉండటానికి కారణం ఈ పాత్ర చేస్తాడో? చేయడో? అనే సందిగ్ధం చాలా మందికి ఉంది. ఆ కారణంగా పోయాయా? లేక ఈడేం ఆర్టిస్టుగా పని చేస్తాడు అని ఇవ్వలేదా? ఏదైనా కానివ్వండి. నేను కెరీర్ ను సీరియస్ గా తీసుకున్న తర్వాత అవకాశాలు పెద్దగా రాలేదు.

రెండు హిట్లు, ఒక యావరేజ్, రెండున్నర ప్లాపులు
నిర్మాతగా నా కెరీర్ చూసుకుంటే జస్ట్ యావరేజ్. రెండు హిట్లు, ఒక యావరేజ్, రెండున్నర ఫెయిల్యూర్స్ ఉన్నాయి. నాలో ఒక మంచి నిర్మాత లేడు. ఒక నటుడు మాత్రమే ఉన్నాడు. అయితే యాక్టర్‌కు సరైన టైములో అవకాశాలు వచ్చేలా నేను ట్రై చేయలేదు. దీంతో యాక్టర్‌గా ఎదగలేక పోయాను. ప్రొడ్యూసర్ లేడు కాబట్టి ఆ రూట్లో కూడా షైన్ అవ్వలేదు. నిర్మాత అంటే డబ్బులు పెట్టి కూర్చోవడం కాదు. అదొక కళ. అందులో బాగా సక్సెస్ అయిన వారు కొందరు మాత్రమే.

నిజం చెప్పడం వల్ల నష్టం ఏమీ ఉండదు
నాలో ఈ టాలెంట్ లేదు, నేను ఇందులో ఫెయిల్ అయ్యాను అని మీరు ఇంత ఓపెన్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? అనే ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ... నిజం కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఒప్పుకోకుండా నేను వేరే భాషల్లో బిజీగా ఉన్నాను అని చెప్పుకోవడం నచ్చదు. కొందరు అలా చెబుతుండటం చూసి నవ్వుకుంటాను. నిజం చెప్పడం వల్ల నష్టం ఏమీ ఉండదు. ఓపెన్‌గా మాట్లాడటానికి, డిప్లమేటిక్ గా మాట్లాడటానికి తేడా తెలియదు.

వారిని గుడ్డిగా నమ్మేశాను
మగధీర లాంటి హిట్ తర్వాత రామ్ చరణ్‌తో చేసే అవకాశం వచ్చిన ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం నాలో నిర్మాత లేక పోవడమే. ఆరెంజ్ సినిమా సమయంలో పూర్తిగా డైరెక్టర్ మీద డిపెండ్ అయిపోయాను. కొందరు నాకు క్లోజ్‌గా ఉండే వ్యక్తులు సినిమాకు అవ్వాల్సిన ఖర్చు కంటే విపరీతంగా పెంచేలా చేయడం, వారిపై గుడ్డి నమ్మకం పెట్టుకోవడం వల్ల అలా జరిగింది. సినిమా విడుదలకు ఒక రోజు ముందు మాత్రమే నేను చేసిన పొరపాటు ఏమిటో తెలిసి రిజయలైజ్ అయ్యాను. జీవితంలో అలాంటి సిచ్యువేషన్ అనుభవిస్తాను అని తెలియదు.

అప్పులు అమాంతం పెరిగిపోయాయి
నా అప్పులు ఒక రోజులో పది రెట్లు పెరిగిపోయాయి. ఈ రోజు 100 రూపాయాల అప్పుంటే మర్నాడుకు 1000 రూపాయల అప్పయింది. నా ఆస్తులు అన్నీ అమ్మినా కూడా 100 రూపాయలు కాదు కదా 15 రూపాయలు కూడా తీర్చలేని పరిస్థితి. పాతాళంలోకి పడిపోయాను. నా జీవితంలో బిగ్గెస్ట్ ట్రామా.

అన్నదమ్ములు ఎప్పటికీ అన్నదమ్ములే అంటాను
ఆ సమయంలో నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఇచ్చింది తమ్మడు పవన్ కళ్యాణ్. అలాగే అన్నయ్య కూడా సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరూ రెండు మూడు రోజుల తేడాతో రియాక్ట్ అయ్యారు. అన్నదమ్ముల కంటే స్నేహితులు బెటర్ అని అంటుంటారు. కానీ నేను మాత్రం అన్నదమ్ములు ఎప్పటికీ అన్నదమ్ములే అంటాను. వారు ఎలాంటి వారైనా నా తమ్ముడు, అన్నయ్య అనే ఫీలవుతారు. నేను కూడా నా తమ్ముడు, అన్నయ్యను చాలా ప్రేమించాను. వాళ్లు నన్ను క్రైసిస్ లో ఉండగా ఆదుకున్నారు. ఆరెంజ్ సినిమా ఫెయిల్ అవ్వలేదు. బిజినెస్ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఓవర్ కాస్ట్ అవ్వడం వల్లే ఇలా జరిగింది.

నా జీవితం ఏమిటో నేను తెలుసుకున్నాను
ఆ బ్యాడ్ మెమెరీ నుంచి బయటకు వచ్చి నా జీవితం ఏమిటో నేను తెలుసుకున్నాను. నన్ను నేను అన్వేషించుకోడం మొదలు పెట్టాను. అన్నయ్య మీద, కళ్యాణ బాబు మీద డిపెండ్ కాకుండా నా మీద నేను ఎక్స్‌ఫోజ్ చేసుకోవడం మొదలు పెట్టాను. కష్టాలు, బాధలు వచ్చినపుడు మనం లొంగిపోయామా అవి మనల్ని మింగేస్తాయి. లొంగి పోకుండా ఎదురు తిరిగితే సొల్యూషన్ కనిపిస్తాయి. అంతే కానీ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదు. నేను అలాంటి ఆలోచన చేశాను కానీ వెంటనే ఆ మూడ్ నుంచి బయటకు వచ్చి నా యుద్ధం నేను చేసి టీవీ రంగంలో మంచి పేరు తెచ్చుకున్నాను. సక్సెస్ అయ్యాను అని నాగబాబు తెలిపారు.


Click it and Unblock the Notifications











