‘మా’...రాజేంద్రుడి గెలుపుకోసం తెరవెనక చిరంజీవి
హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కు మెగా ఫ్యామిలీ మద్దతు లభించింది. గురువారం ఫిల్మ్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ నటుడు నాగబాబు, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ‘మా' అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్‌కు మద్దతిస్తున్నట్లు నాగబాబు ప్రకటించారు. రాజేంద్రప్రసాద్ ఎప్పుడో అధ్యక్ష పదవి చేపట్టాల్సి వ్యక్తి అని పేర్కొన్నారు. చిరంజీవి సూచన మేరకే నాగబాబు ఈ ప్రకటన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మెగా స్టార్ మద్దతు ఉంటే రాజేంద్రప్రసాద్ గెలుపు ఖాయమే అనే వాదన వినిపిస్తోంది.
ప్రస్తుతం ‘మా' అధ్యక్షుడిగా మురళీ మోహన్ కొనసాగుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో మురళీ మోహన్ మళ్లీ పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు నటి జయసుధ కూడా పోటీకి సిద్దమవుతున్నారు. ఈ నెల 29న మా కార్యవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఆ మధ్య రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పిన రాజేంద్రప్రసాద్.... ఒకవేళ మా అధ్యక్ష పదవికి పోటీ ఉన్నా బరిలో ఉంటానని స్పష్టం చేశారు.

గత కొన్నేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్న మురళీ మోహన్ స్థానం ఖాళీ అయితే కొత్త వ్యక్తి రావాలని పలువురు ఆర్టిస్టులు కోరుకుంటున్నారు. రాజేంద్రప్రసాద్ మా అధ్యక్ష పదవికి అన్ని విధాలా అర్హుడని పలువురు ఆర్టిస్టులు అభిప్రాయ పడుతున్నారు. గతంలో ఓసారి రాజేంద్రప్రసాద్ ‘మా' ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరీ ఈసారి ‘మా' ప్రెసిడెంట్ పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











