ఆ విగ్రహం మా ఇంటికి ఎలా వచ్చిందో: నాగార్జున
ఓ రోజు రాత్రి షూటింగ్ పూర్తయ్యాక ఇంటికి వెళ్తే అంతా చీకటి. కానీ గుమ్మంలో రేడియేషన్ వెలుగుల్లో బాబా ప్రతిమ కనిపించి ఆశ్చర్యపోయాను. అది అక్కడకు ఎలా వచ్చిందో ఇంట్లో ఎవరికీ తెలియదు అన్నారు నాగార్జున. నాగార్జున బాబా పాత్రలో నటిస్తున్న చిత్రం 'శిరిడి సాయి'. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.మహేష్‌రెడ్డి నిర్మాత. శ్రీకాంత్, సాయికుమార్, శ్రీహరి ముఖ్యపాత్రధారులు. చిత్రీకరణ తుది దశకు చేరుకొంది. ఈ నెల 30న పాటలు విడుదల చేస్తారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున ఇలా మాట్లాడారు.
ఇక నాకు బాబా గురించి పెద్దగా తెలియదు. అయితే సినిమా ప్రారంభానికి రెండు నెలల ముందు నుంచే మా ఇంటికి సాయిబాబా ఫొటోలు, విగ్రహాలు వచ్చాయి. అంతవరకు నాకు శిరిడి సాయిబాబా పేరు వినడం, ఎవరైనా ప్రసాదం తెచ్చిస్తే తినడం తప్ప అక్కడికి వెళ్లింది లేదు. అయితే ఉన్నట్టుండి ఒక రోజు శిరిడి వెళ్లాలనిపించింది. ఎవరికీ చెప్పకుండా వెళ్లాను అన్నారు నాగార్జున.
అలాగే నేను షిర్డీ నుంచి తిరిగి రాగానే రాఘవేంద్రరావు ఈ కథ గురించి చెప్పారు. వెంటనే సినిమా ప్రారంభమైంది. చిత్రీకరణ జరిగినన్ని రోజులూ సాయిబాబా ఏదో ఒక రూపంలో కనిపించేవారు. అందుకే సమస్త సద్గురు సాయినాథ్ మహరాజ్‌కీ జై అని తలచుకొంటుంటాన్నేను. అన్నమయ్య, శ్రీరామదాసులో భక్తుడిగా చేశాను కానీ... సాయిబాబా పాత్రలో ఒదిగిపోవడం ఎలా? అని ఆలోచించడం మొదలుపెట్టగానే సెట్‌లో 'ఓం సాయి శ్రీసాయి' అని పాట వినిపించారు. అంతే ఆ పాత్రలో లీనమైపోయాను అని చెప్పారు.
కీరవాణి మాట్లాడుతూ '''అల్లరి మొగుడు' సమయంలో బాబా పాటతో సంగీత చర్చలు మొదలుపెట్టాం. ఆ పాటను ఇంతవరకూ సినిమాల్లో ఉపయోగించలేకపోయాం. చివరకు ఇందులో కుదిరింది. అంటే 20 ఏళ్లకు ముందే ఈ సినిమాకు అంకురార్పణ జరిగిందని చెప్పాలి. బాబాగా నటిస్తున్న నాగార్జున ధన్యుడు. కామిగానివాడు మోక్షగామిగాడు అనడానికి రాఘవేంద్రరావు గారే నిదర్శనం. ఈ నెల 30న పాటలు విడుదల చేస్తాం'' అని చెప్పారు.
అన్నమయ్య, శ్రీరామదాసుల్లాగా ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని నిర్మాత పేర్కొన్నారు. 60 రోజుల్లో చిత్రీకరణ పూర్తయిందని, మిగిలిన ఒకే ఒక్క షాట్‌ను ఈ నెల 26న శిరిడీలో తీస్తారని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా పరుచూరి వెంకటేశ్వరరావు, ఎస్. గోపాల్‌రెడ్డి, కె.విక్రమ్‌కుమార్ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











