నయనతార విడిపోయిన విషయం తెలీదు : నాగార్జున
హైదరాబాద్ : అప్పట్లో ప్రభుదేవాతో ప్రేమలో పడి, పెళ్లికి సిద్ధమైన నయనతార శ్రీరామ రాజ్యం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం కావాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తర్వాత ప్రభుదేవాతో విబేధాలు వచ్చి విడిపోయింది. దీంతో మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుంది. ఆమె ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒప్పుకున్న తొలి సినిమా 'గ్రీకువీరుడు'.
కింగ్ నాగార్జున మే 3న 'గ్రీకు వీరుడు' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలో తన సరసన నటిస్తున్న నయనతార గురించిన ఆసక్తికర విషయం వెల్లడించారు.
''ఈ సినిమాలో నటించమని అడగటానికే నేను నయనతారకు ఫోన్ చేసాను. అప్పుడు తను సినిమాలకు బ్రేక్ తీసుకుంది. నేను ఫోన్ చేసిన రోజు ఉదయమే మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుందట. నాకు ఆ విషయం తెలియదు. 'గ్రీకు వీరుడు'లో నటిస్తావా అని అడిగితే ..'నేను బ్రేకప్ అయిన విషయం ఎలా తెలిసింది' అని అడిగింది.
'నాకు తెలియదు. క్యాజువల్‌గా సినిమాలో చేయమని అడుగుదామని చేసాను' అన్నాను. అప్పుడు తను 'నేను బ్రేకప్ అయ్యాను. ఇక నుంచి మళ్లీ సినిమాల్లో చేయాలని అనుకుంటున్నాను' అని చెప్పింది. తను ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒప్పుకున్న మొదటి చిత్రం 'గ్రీకు వీరుడు' అని....నాగార్జున చెప్పుకొచ్చారు. ''

సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసారు. మే 3వ తేదీన ఈచిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గ్రీకు వీరుడు'లో నాగార్జున ఓ ఎన్నారైగా, డిఫరెంట్ గెటప్ లో స్టైలిష్‌గా కనిపించనున్నారు. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరత్ ఈ చిత్రానికి దర్శకుడు.

నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.

మీరాచోప్రా, కె.విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, వేణుమాధవ్, వెన్నెల కిషోర్, కాశీ విశ్వనాథ్, నాగినీడు, గీతాంజలి, సుధ, జయలక్ష్మి, జయవాణి, లహరి, ఇందు తదితరులు ఇతర పాత్రధారులు.

ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.


Click it and Unblock the Notifications











