వర్మ సినిమాలో విలన్ గా నాగార్జున ఎంపిక
రామ్ గోపాల్ వర్మ చిత్రం శివతో స్టార్ గా ఎదిగిన నాగార్జున మరోసారి ఆయన దర్శకత్వంలో చేయనున్నారని సమాచారం. రామ్ గోపాల్ వర్మ రామాయణం టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాగార్జునని రావన్ రాజు అనే పాత్రకు అడిగినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఓ కార్పోరేట్ సంస్ధకు అధిపతిగా నాగార్జున మోడ్రన్ టచ్ తో పౌరాణిక మూలాలు ఉన్న పాత్రను పోషిస్తారు. అలాగే ఆ పాత్ర సినిమాలో నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్ర. రామాయణానికి ఓ కొత్త ట్విస్టు ఇచ్చి సినిమాని నడపాలనుకుంటున్నాడని, అందుకే పాత్రలకు సైతం పాపులర్ స్టార్స్ నే ఎంపిక చేయాలని నాగార్జునని సంప్రదించాడని తెలుస్తోంది. నాగార్జున సైతం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక ఈ పాత్రలో మనుష్యుల్లో ఉండే చీకటి వాంఛలను చూపనున్నారని చెప్తున్నారు. మన్మధుడు గా ఇన్నాళ్లూ ఏలుతున్న నాగార్జున ఒక్కసారిగా ఇటువంటి పాత్రను ఒప్పుకుని వైవిద్యతను ప్రదర్సించాలనుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం నాగార్జున ఢమురకం చిత్రంలో చేస్తున్నారు. శ్రీనివాస రెడ్డి దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఓ సోషియో పాంఠసీ. అనూష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. మరో ప్రక్క నాగార్జున కుమారుడు నాగచైతన్యతో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన బెజవాడ చిత్రం ఈ వారంలోనే విడుదల కానుంది. ఈ చిత్రంపై నాగచైతన్య, నాగార్జున చాలా ఆశలు పెట్టుకున్నారు. దడ చిత్రం డిజాస్టర్ కావటంతో ఈ చిత్రంతో అయినా తన కుమారుడు యాక్షన్ స్లాట్ లోకి వెళ్ళాలని నాగార్జున భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











