'ఎన్టీఆర్ తర్వాత నువ్వే'అన్నారు
హైదరాబాద్ : కావలిలో ఒక వ్యక్తి ... 'మహానటుడు ఎన్టీఆర్ తర్వాత ఇలాంటి పాత్రలు చేయాలంటే మీరే' అని అభినందించారు. తెలుగు సినిమాకు మూల స్థంభం లాంటి మహానటునితో నన్ను పోల్చి మాట్లాడటం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన'' అని అక్కినేని నాగార్జున అన్నారు.. ఆ మాటల్ని ఆశీర్వచనాలుగా స్వీకరిస్తున్నాను. ఇలాంటి సినిమాలు చేయడం కష్టం అన్నారు నాగార్జున.
రీసెంట్ గా నాగార్జున శిరిడీ సాయి చిత్రం విజయోత్సవాలు పేరట టూర్ వెళ్ళారు. అక్కడ అనుభవాలను మీడియాతో పంచుకుంటూ ఇలా స్పందించారు. అలాగే..అక్కడ థియేటర్లలో సినిమా చూసిన వాళ్ళందరూ నాతో పాటు, నా కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని ఆశీర్వదించారు. నాకు రామాయణ, భారతాలంటే ఇష్టం. అలాగే జానపద, పౌరాణికాల్లోనూ మంచి పాత్రలతో ఎవరైనా ముందుకొస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సాయితత్వం నా వ్యక్తిగత జీవితంపై ప్రభావాన్ని చూపించింది కానీ సినీ జీవితంపై కాదు. తెరపై అన్ని రకాల పాత్రల్లోనూ కనిపిస్తాను అని నాగార్జున అన్నారు.
ఇక "19 ఏళ్ళ కుర్రాడు శిరిడిసాయి పైరసీ చేసి పట్టుబడ్డాడని తెలిసి బాధనిపించింది. అఖిల్‌కు కూడా అదే వయసు. నాకు వెంటనే అఖిల్ గుర్తుకొచ్చాడు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. విదేశాలలో లాగా ఇక్కడ కూడా కఠినమైన శిక్షలను అమలు చేయబోతున్నారని విన్నాను. చిన్న పిల్లలు ఇలాంటి తప్పిదాలకు దూరంగా ఉండాలికమర్షియల్ హీరోలు, దర్శకులు ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. నా చిత్రాలన్నింటిలోకీ అత్యుత్తమ తొలి వార కలెక్షన్లను శిరిడిసాయి సొంతం చేసుకుంది. మా నిర్మాత మహేష్ రెడ్డి పిచ్చి భక్తుడు. ఆయనకు అన్నీ సాయే. ఈ సినిమాను ప్రపంచలోని పలు కొత్త ప్రాంతాల్లో విడుదల చేయడం ఆనందంగా ఉంది. చిరంజీవిగారు, వినాయక్, రాజమౌళి, నాన్నగారితో పాటు ఎంతో మంది అభినందించారు'' అని అన్నారు.
నిర్మాత మహేష్ రెడ్డి మాట్లాడుతూ "మరో మూడు నెలల్లో ఈ సినిమాను మరాఠి, హిందీ, తమిళ్, మలయాళంలో విడుదల చేస్తాం. నేను గత కొన్నేళ్ళకు ముందు శిరిడిసాయినాథుడికి బంగారు సింహాసనం చేయించినప్పుడు ఎంత ఆనందపడ్డానో, శిరిడిసాయి విడుదలైన రోజు కూడా అంతే సంతృప్తిని అనుభవించాను'' అని చెప్పారు. స్క్రీన్‌ప్లే శిరిడిసాయికి చాలా గొప్పగా కుదిరిందని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.


Click it and Unblock the Notifications











