నాగ్ కొత్త చిత్రం రాజు గారి గది 2 లాంచ్ (ఫొటోలు),సంచలన ప్రకటన,జనాలతో ఆడుకునే...
నాగార్జున హీరోగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న రాజు గారి గది 2.. ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.
హైదరాబాద్ : గత కొంతకాలంగా హారర్ కామెడీలకు, హారర్ థ్రిల్లర్ సినిమాలకి తెలుగునాట మంచి ఆదరణ లభిస్తూన్న సంగతి తెలిసిందే.దాంతో ఆ తరహా సినిమాలే ఎక్కువగా రూపొందుతున్నాయి. రీసెంట్ గా కూడా ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్రం భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. అయితే ఈ తరహా సినిమాలు కూడా కంటెంట్ బాగుంటేనే భారీ వసూళ్లు సాధిస్తున్నాయి.
అలా ఆ మధ్య ఆసక్తికరమైన కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో 'రాజుగారి గది' ఒకటి. ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించడంతో, దర్శకుడు ఓంకార్ సీక్వెల్ ను ప్లాన్ చేశాడు. తెలుగులో భారీ చిత్రాలు నిర్మిస్తున్న పీవీపీ బ్యానర్ వారు ఈ సీక్వెల్ ని నిర్మించటానికి ముందుకు వచ్చారు.
అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏమిటీ అంటే. ఇలా క్రేజీ ప్రాజెక్ట్ గా నిర్మించబడుతోన్న ఈ సీక్వెల్ లో నాగార్జున ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ ఆదివారం రోజున ఈ సినిమా షూటింగును లాంఛనంగా ప్రారంభించారు.

తొలిసారి ఇలాంటి
ఈ చిత్రం లాంచింగ్ సందర్బంగా... నాగార్జున సంచలన ప్రకటన చేశారు. తన జీవితంలో తొలిసారి ఓ హర్రర్ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు. అది కూడా ఓ చిన్న డైరెక్టర్‌తో నాగార్జున నటిస్తుండడం విశేషం చెప్పబడుతోంది. ఓంకార్‌తో నాగ్ ఈ హర్రర్ సినిమాను చేస్తూండటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

రెండు బ్యానర్స్ కలిసి..
అక్కినేని నాగార్జున హీరోగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న హర్రర్ థ్రిల్లర్ `రాజు గారి గది 2`. పి.వి.పి సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి.

అన్నపూర్ణలో..
ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు నాగార్జునతో పాటు దర్శకుడు, నిర్మాత, టెక్నీషియన్స్ , నాగార్జున శ్రేయాభిలాషులు వచ్చారు.

పొట్లూరి ప్రసాద్ కెమెరా స్విచ్..
ముహుర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ కొట్టగా, నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఓంకార్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. మీడియా మిత్రులను పిలిచి ఈ ప్రారంభోత్సవం వేడకలా జరిపారు.

కథ వినమన్నారు
``నా కెరీర్‌లో `మనం` ఓ టర్న్. తర్వాత `ఊపిరి`, `సోగ్గాడే చిన్ని నాయనా` సినిమాలో సక్సెస్ కొట్టాను. నెక్ట్స్ ఏ సినిమా చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు `ఓం నమో వేంకటేశాయ` సినిమా అవకాశం రావడం, అందులో నటించడం జరిగింది. తర్వాత ఏ సినిమా చేయాలనుకుంటున్న సమయంలో ఓంకార్ దగ్గర ఓ మంచి కథ ఉందని నిరంజన్, పివిపిగారు నన్ను కలిసి కథ వినమన్నారు అని నాగార్జున అన్నారు.

కథ వినగానే నచ్చింది
కథలో కొత్తదనం ఉంటేనే చేస్తానని వారితో అన్నాను. ఓంకార్ వద్ద ఒక సబ్జెక్ట్ ఉందని, అది థ్రిల్లర్, కామెడీ కాన్సెప్ట్.. చేస్తారా అని అడిగారని.. అయితే తనకు కూడా థ్రిల్లర్, హర్రర్ మధ్య ఉండే ఒక క్యారెక్టర్ చేయాలని ఎప్పటినుంచో కోరిక ఉందని నాగార్జున తెలిపారు. కథ వినగానే బాగా నచ్చింది. నాకు ఇష్టమైన థ్రిల్లర్ జోనర్ మూవీ. ఇప్పటి వరకు ఇలాంటి కథలో నేను నటించలేదు.

డిఫెరెంట్ పాత్ర
`రాజుగారి గది` సినిమా చూడలేదు. అయితే ఓంకార్ గురించి బాగా తెలుసు. గతంలో తనతో కలిసి ఓ గేమ్ షో చేయాల్సింది. కానీ కుదరలేదు. తనపై నాకు నమ్మకం ఉంది. ఊపిరి, సోగ్గాడే చిన్నినాయనా తరహాలో నా క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది అన్నారు నాగార్జున.

మనుష్యులతో ఆడుకునే..
ఊపిరి సినిమా కథ విని సినిమా చేస్తున్నప్పుడు ఎంత ఎగ్జయిట్‌మెంట్ ఫీలయ్యానో `రాజుగారి గది2` సినిమా కథ వినగానే ఎప్పుడెప్పుడు సినిమా చేయాలా అని ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో మనుషులతో అడుకునే క్యారెక్టర్ చేస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని నమ్మకం ఉంది`` అన్నారు నాగార్జున.

ఆయన సూచనలతోనే
నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ - ``నాగార్జున గారితో ఊపిరి సినిమా తర్వాత చేస్తున్న సినిమా `రాజుగారి గది2`. నాగార్జునగారితో మా బ్యానర్‌లో చేస్తున్న మరో ప్రెస్టిజియస్ మూవీ ఇది. నాగార్జున గారి సూచనలతో స్ర్కిప్ట్ లో కొన్ని మార్పులు చేశాం అన్నారు.

మరిచిపోలేని చిత్రం
నాగార్జున గారి కెరీర్ లో మరచిపోలేని చిత్రంగా నిలుస్తుంది. నా డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఖచ్చితంగా `రాజు గారి గది 2` బిగ్ హిట్ మూవీ అవుతుంది`` అన్నారు పివివి.

డాన్ సినిమా నుంచి...
రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ - ``డాన్ సినిమాకు నాగార్జున గారితో ఫస్ట్ టైం వర్క్ చేశాను. తర్వాత ఊపిరి సినిమాకు వర్క్ చేశాను. ఇప్పుడు రాజుగారిగది2 సినిమా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. నాగార్జున గారు ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్ ను ఈ చిత్రంలో చేస్తున్నారు. ఆయన కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్ గా నిలుస్తుంది``అన్నారు.

సూపర్ స్క్రిప్టు ఇది
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ - ``బలుపు తర్వాత పి.వి.పి సంస్థలో నేను చేస్తున్న సినిమా ఇది. నాగార్జునగారితో ఓంకార్ సూపర్ స్ర్కిప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి వర్క్ చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్`` అన్నారు.
ఇంతవరకూ చూడని
డైరెక్టర్ ఓంకార్ మాట్లాడుతూ - `` యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నేను చాలా కష్టపడి ఈస్ధాయికి వచ్చాను. ఇప్పటి వరకు చూడని నాగార్జున గారిని ప్రజెంట్ చేస్తున్నాను. గత ఏడాది అక్టోబర్ 27న విడుదలైన రాజుగారి గది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

నమ్మకం నిలబెట్టుకుంటా
ఈ సంవత్సరం అదే రోజున (రాజుగారి కథ రిలీజు రోజన )అక్టోబర్ 27న నాగ్ సార్ కి కథ చెప్పాను. కథ విన్న ఆయన నచ్చి నటించడానికి ఒప్పుకున్నారు. నా పై పి.వి.పి గారు, నాగ్ సార్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను``అన్నారు ఓంకార్.

ఎవరెవరు..
నాగార్జున, వెన్నెల కిషోర్, అశ్విన్ బాబు, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ - దివాకరన్, మ్యూజిక్ - తమన్, ఆర్ట్ - ఎ.ఎస్.ప్రకాష్, డైలాగ్స్ - అబ్బూరి రవి, నిర్మాత - పి.వి.పి, దర్శకత్వం - ఓంకార్.


Click it and Unblock the Notifications











