హీరో లందరూ 'రగడ'లాంటి సినిమా చెయ్యాలి...నాగార్జున
స్టార్ ఇమేజ్ ఉన్న ప్రతి హీరో 'రగడ'లాంటి సినిమాలు తప్పకుండా చెయ్యాలన్నది నా అభిప్రాయం. పరిశ్రమకు అది అవసరం కూడా. వాణిజ్యపరంగా చిత్ర పరిశ్రమ కూడా మెరుగుపడుతుంది. 'సింహా', 'దబాంగ్' చిత్రాల కోవకు చెందిన చిత్రమిది. 'రగడ' సినిమాలకు విమర్శకుల సమీక్షలు ఏమంత గొప్పగా ఉండవు. అయితే సగటు ప్రేక్షకుణ్ని మాత్రం మెప్పిస్తాయి అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున. ఆయన తాజా చిత్రం 'రగడ' ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే...కమర్షియల్ గా 'మాస్' కంటే పెద్ద విజయాన్ని సాధించింది 'రగడ'. ఇది కొత్త కథైతే కాదని నేను ముందు నుంచీ చెబుతున్నా. ప్రేక్షకుల్ని మెప్పించగలిగాం. యేడాది చివరలో మంచి వసూళ్లతో కూడిన చక్కటి విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది. మొదటి ఏడు రోజులకే రూ.11కోట్లు వసూలు చేసింది. ఇలాంటి సినిమా కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదిస్తున్నారు వాళ్లు.
రాయలసీమ యాస, బ్రహ్మానందం కామెడీ, ఆసక్తికరమైన మలుపులు, పాటలు, యాక్షన్, దర్శకుడు వీరూ పోట్ల రాసిన సంభాషణలు...అన్నీ కలిసొచ్చాయి.నా సినిమా జీవితానికి మరో మైలురాయిలాంటి చిత్రం 'రగడ'అన్నారు నాగార్జున.


Click it and Unblock the Notifications











