హాట్ టాపిక్: రామ్ చరణ్ తండ్రి పాత్రకు నాగార్జున?
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభోత్సవం కూడా జరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ తండ్రి పాత్ర నాగార్జునతో చేయించాలనే ప్లాన్లో ఉన్నాడట కృష్ణ వంశీ.
గతంలో వెంకటేష్‌తో ఈ పాత్ర ప్లాన్ చేసారు. అయితే క్యారెక్టరైజేషన్ నచ్చక పోవడంతో వెంకీ ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. సినిమాలోకి శ్రీకాంత్ ఎంటర్ కావడంతో.... ఆ పాత్రను అతనితో చేయిస్తారని అంతా భావించారు. తాజాగా తేలిన విషయం ఏమిటంటే శ్రీకాంత్ ఈచిత్రంలో చెర్రీ బాబాయ్ పాత్ర చేస్తున్నారని....తండ్రి పాత్ర నాగార్జునతో చేయించాలని దర్శకుడు భావిస్తున్నాడని అంటున్నారు.
నాగార్జున ఇమేజ్ ఏ మాత్రం డ్యామేజీ కాకుండా, ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా పాత్రలో మార్పులు, చేర్పులు చేసి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట కృష్ణ వంశీ. గతంలో తనకు 'నిన్నే పెళ్లాడతా' లాంటి హిట్ చిత్రాన్ని అందించిన కృష్ణ వంశీ మాటను నాగార్జున కాదనరని, ఆయన చెర్రీ తండ్రి పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్.
పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో, శివబాబు బండ్ల సమర్పణలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 6న ప్రారంభోత్సవం నిరాడంబరంగా ఫిలింనగర్ దైవ సన్నిదానంలో పూజా కార్యక్రమాలతో జరిగింది. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో షూటింగ్ అనంతరం దాదాపు 40 రోజుల పాటు రామేశ్వరం, నాగర్ కోయిల్, పొల్లాచ్చిలోని అందమైన లొకేషన్లలో షూటింగ్ చేయబోతున్నాం. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications












