అలాంటి పాత్ర అయితేనే చేస్తా...అక్కినేని
డబ్బు కోసం ఏదో ఒక పాత్ర చేయడం వల్ల నాగేశ్వరరావు ఇలాంటి పాత్రలు చేస్తున్నారంటూ పాతతరం వారు తిట్టుకునే ప్రమాదం ఉందంటూ ప్రముఖ నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు తన మనస్సులోని మాటను చెప్పారు. అలాగే ఏదో ఒక పాత్ర చేయటం వల్ల నవతరాన్ని కూడా సంతృప్తి పరచలేమని అభిప్రాయపడ్డారు. 'సీతారామయ్యగారి మనవరాలు' చిత్రంలోని సీతారామయ్య లాంటి పాత్రలైతేనే చేయదలచుకున్నానని స్పష్టం చేశారు. హైద్రాబాద్ లో జరిగిన 'మా' డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో అక్కినేని మాట్లాడారు.
అలాగే 'మా' డైరీని స్వయంగా అక్కినేని ఆవిష్కరించి వచ్చే ఏడాది డైరీ ఆవిష్కరణకు తాను రాలేనని అన్నారు. ఎనభై ఆరవ పడిలోకి అడుగుపెట్టినందున రిస్క్ తీసుకోవడం ఎందుకనే ఉద్దేశంతో ఇక నుంచి ఫంక్షన్లకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు చెప్పారు. అలాగే తాను చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలని గతంలో నిర్ణయించుకున్నాననీ,అయితే 'శ్రీరామదాసు' తర్వాత మళ్లీ తాను నటించలేదనీ అక్కినేని అన్నారు. సినిమాలో నటిస్తే డబ్బు బాగా ఇచ్చే వారు ఉన్నప్పటికీ ఏదో ఒక పాత్ర చేయాలని తాను అనుకోవడం లేదనీ, ఆచితూసి సినిమాలు చేస్తాననీ అన్నారు.


Click it and Unblock the Notifications











